తెలంగాణా ఉద్యమాలు మొదలుపెట్టింది మేమే

June 02, 2018


img

తెలంగాణా రాష్ట్రావతరణ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస పుట్టకమునుపే మేము (టి-కాంగ్రెస్) ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాము. తెరాస ఉద్యమాలు మొదలుపెట్టక మునుపే మా పార్టీ తెలంగాణా కోసం ఉద్యమించింది. ఈ ప్రయత్నంలో సోనియా గాంధీకి ఎన్ని సవాళ్ళు, అవరోధాలు ఎదురైనా ఆమె వెనకడుగువేయకుండా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కనుక తెలంగాణా రాష్ట్ర సాధన ఘనత ఆమెకు, మా పార్టీకే చెందుతుంది. కానీ తనవల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని కెసిఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి కట్టుబడి మేము ప్రతిపక్షపార్టీగా మా బాధ్యత నేరవేర్చుతున్నాము. ఈ నాలుగేళ్ళలో సిఎం కెసిఆర్ చేసిందేమిటంటే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వంచించడమే. అయన చేతిలో తెలంగాణా దగా పడింది. అందుకే ‘దగాపడ్డ తెలంగాణా’ అనే ఈ కరపత్రం ద్వారా అయన ప్రజలను ఏవిధంగా వంచిస్తున్నారో వివరించాము. వచ్చే జూన్ 2నాటికి కెసిఆర్ ఆ కుర్చీలో ఉండరు. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.

కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి 1969లోనే తెలంగాణా ప్రజాసమితిని స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలుపెట్టి వాటిని అనతికాలంలోనే పతాకస్థాయికి తీసుకుపోగలిగారు. కానీ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఒత్తిడితో రాజీకి అంగీకరించి ఉద్యమాన్ని విరమించారు. ఆ తరువాత 1985లో తెలంగాణా ఉద్యోగులు,1997 భాజపా తెలంగాణా రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. మళ్ళీ 2000 సం.లో తెలంగాణాకు చెందిన ఎమ్మెల్యేలు ‘తెలంగాణా కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం’ అనే వేదికను ఏర్పాటు చేసుకుని, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చారు. అయితే తెలంగాణా ఉద్యమాలు ఊపందుకున్నది మాత్రం కెసిఆర్ తెరాసను ఏర్పాటు చేసిన తరువాతే. ఏప్రిల్ 27, 2001న తెరాసను ఏర్పాటుచేసి, జూన్ 2, 2014న తెలంగాణా రాష్ట్రం ఏర్పడేవరకు అలుపెరుగని పోరాటాలు చేశారు.


తెరాస కంటే కాంగ్రెస్ పార్టీయే ముందుగా తెలంగాణా కోసం ఉద్యమించినప్పటికీ, దాని పోరాటాలు కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేసింది. ఏ యుద్ధంలోనైనా చివరిగా ఎవరు విజయం సాధించారో వారికే ఆ క్రెడిట్ దక్కుతుంది కనుక తెలంగాణా సాధించిన క్రెడిట్ కెసిఆర్ కే దక్కింది.


అయితే అయన అంగీకరించినా అంగీకరించకపోయినా కోట్లాదిమంది తెలంగాణా ప్రజలకు, సోనియా గాంధీకి, రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలకు, తెలంగాణా రాజకీయ జెఏసి, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఇంకా బలిదానాలు చేసుకున్న వందలాది విద్యార్దులకు ఆ క్రెడిట్ లో భాగం ఉంటుంది. 






Related Post