జగన్ మళ్ళీ మడమ తిప్పాడా?

June 02, 2018


img
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నడూ మడమ తిప్పనని చెపుతుంటారు. కానీ తెలంగాణా ఏర్పాటుకు మద్దతు ఇచ్చే విషయంలో మొదటిసారి మడమ తిప్పి సమైక్యశంఖారావం పూరించారు. అప్పటి నుంచి ఏదో ఓ సందర్భంలో మడమ తిప్పుతూనే ఉన్నారు. తాజాగా భాజపాతో స్నేహం చేసే విషయంపై పునరాలోచనలో పడినట్లున్నారు. 

భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకొంటే భాజపాతో చేతులు కలపాలని చాలా కాలంగా ఆశగా ఎదురుచూసిన జగన్మోహన్ రెడ్డి, ఆ అవకాశంరాగానే భాజపాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయి రెడ్డి ప్రధాని మోడీను తరచుకలవడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏపిలో భాజపా నేతలు కూడా వైకాపాకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ హటాత్తుగా వాటి మద్య ఏమయిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి భాజపాను ఓడించాలని ప్రజలకు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో ‘ప్రజా సంకల్ప యాత్ర’ లో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్, భాజపాలు రెంటినీ నమ్మడానికి లేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టించింది. అధికారంలో ఉన్న భాజపా, తెదేపాలు రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ప్రజలకు మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేసి ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, భాజపా, తెదేపా మూడు పార్టీలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించి గట్టిగా బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో 25 ఎంపి సీట్లు వైకాపాకు ఇచ్చినట్లయితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఏవిధంగా రాదో మేమూ చూస్తాం. ప్రత్యేకహోదా ఇస్తామని లిఖితపూర్వకంగా ఏ పార్టీ హామీ ఇస్తుందో దానికే మద్దతు ఇద్దాము లేదంటే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా వైకాపా ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దం,” అని అన్నారు.

Related Post