పధకాలతో తెరాస...జనంలో జనసమితి!

June 01, 2018


img

తెరాస సర్కార్ నెలకొక అద్భుతమైన సంక్షేమ పధకంతో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, కొత్తగా ఏర్పాటైన తెలంగాణా జనసమితి (టిజెఎస్) రైతుతో కలిసి వారి సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. 

పంటలకు మద్దతుధర కల్పించాలని, తక్షణం రైతులకు పాసు పుస్తకాలను అందించి బ్యాంక్ లోన్లు ఇప్పించాలని, కౌలు రైతులకు రైతుబంధు పధకాన్ని వర్తింపజేయాలని, రుణమాఫీ పధకం ద్వారా లబ్ది పొందిన రైతుల వడ్డీని కూడా మాఫీ చేయాలని, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని కోరుతూ టిజెఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎం.ఎల్), న్యూడెమొక్రసీ పార్టీలు కలిసి రాష్ట్రంలో ‘సడక్ బంద్’ పేరుతో రోడ్లపై బైటాయించి ధర్నాలు చేస్తున్నాయి. 

ఖమ్మం జిల్లాలో తిరులాయపాలెం మండలం నుంచి ఎంకూరు మండలం వరకు పలుచోట్ల ఆ పార్టీల అధ్య్వర్యంలో రాస్తా రోకోలు జరిగాయి. అలాగే ఖమ్మం నగరంలో రాపర్తి నగర్ కూడలి వద్ద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాలలో,  మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ఎదుట,  బయ్యారంలో గంధపల్లి, బయ్యారం రహదారిపై, తొర్రూరులో బస్టాండ్‌ సెంటర్‌ వద్ద, దంతాలపల్లి కూడలిలో, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో, హుజురాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నాలు, రాస్తారోకో, దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

ఈ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం,  సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రాంప్రసాద్‌, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, న్యూ డెమోక్రసీ నాయకురాలు కెచ్చల కల్పన, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. సంజీవరెడ్డి, తెలంగాణా రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రవి కుమార్‌, యలమంచి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగారెడ్డి, సాగర్‌, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని తరువాత విడిచి పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కుల పంపిణీ, పాసు పుస్తకాల పంపిణీ ద్వారా రాష్ట్రంలో రైతులందరినీ తెరాసవైపు తిప్పుకోవాలనుకుంటే, వాటిలో జరుగుతున్న పొరపాట్లను వామపక్షాలు, తెలంగాణా జనసమితి తెలివిగా ఉపయోగించుకొంటూ రైతులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండటం విచిత్రంగానే ఉంది.


Related Post