అయితే మోడీ లేకుంటే రాహుల్ అంతే..

June 01, 2018


img

ఇటీవల దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు, 11 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికలలో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. భాజపా ప్రాతినిధ్యం వహిస్తున్న 4 లోక్ సభ స్థానాలలో భాజపా ఒక్కటే గెలుచుకోగలిగింది. మరొకటి దాని మిత్రపక్షం ఎన్.డి.పి.పి. గెలుచుకొంది. ఇక 11 అసెంబ్లీ సీట్లలో భాజపా ఒక్క సీటు మాత్రమే గెలుచుకొంది. అంటే దేశంలో భాజపాకు వ్యతిరేక గాలులువీయడం మొదలయిందని, 2019 ఎన్నికలలో భాజపా నేతృత్వంలో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, ప్రతిపక్షపార్టీలు వాదిస్తున్నాయి. 

భాజపాను ఓడించడమే లక్ష్యంగా యూపి, బిహార్, మహారాష్ట్రలలో ప్రతిపక్షపార్టీలు తమ అభిప్రాయభేదాలను, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా అభ్యర్ధులను నిలబెట్టడం చేత భాజపాకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇక ఆయా ప్రాంతాలలో స్థానిక సమస్యలు, స్థానిక రాజకీయబలాబలాలు వగైరా కూడా భాజపా ఓటమికి కారణమయ్యాయి. 

ఈ ఉపఎన్నికల ఫలితాలను చూసి సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇక ప్రాంతీయపార్టీలే పైచెయ్యి సాధిస్తాయనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అయితే ఉపఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు చాలా తేడా ఉందనే సంగతి అందరికీ తెలుసు. ఉపఎన్నికలలో ప్రాంతీయపార్టీలు తమతో కలిసివచ్చే వారితో రాజీపడటానికి పెద్దగా సంకోచించవు. కానీ సార్వత్రిక ఎన్నికలలో చేతులు కలపాలంటే బారీ సంఖ్యలో సీట్లసర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. అందుకు సిద్దపడితే పార్టీలో అసంతృప్తి, తిరుగుబాటు మొదలవుతుంది. కనుక ఉపఎన్నికలంత తేలికగా సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు చేతులు కలపలేవు. ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారం పంచుకునే విషయంలోనూ అవి రాజీపడేందుకు సిద్దపడవు. ఎందుకంటే అధికారం సంపాదించడం కోసమే అవి చాలా ‘వ్యయప్రయాసలు’ పడతాయి. 

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అవుతారు తప్ప అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ లేదా మరొకరు కాలేరు. వారికి కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం ఇవ్వదు కూడా. 

కనుక కేంద్రంలో చక్రం తిప్పాలంటే ప్రాంతీయ పార్టీలు కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవలసి ఉంటుంది. కనుక సార్వత్రిక ఎన్నికలకు ముందు సీట్లు సర్దుబాటులో, ఎన్నికల తరువాత అధికారం పంచుకొనే విషయంలో ప్రాంతీయపార్టీల మద్య ఐక్యత కష్టమే. వాటి అనైక్యత, పదవీ లాలసలే కాంగ్రెస్, భాజపాలకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. అంటే వచ్చే ఎన్నికలలో ప్రాంతీయపార్టీలు తమ తమ రాష్ట్రాలలో ఘన విజయం సాధించినా కేంద్రంలో భాజపా లేదా కాంగ్రెస్ పార్టీలకే అధికారం దక్కే అవకాశం ఉందని భావించవచ్చు.


Related Post