తెదేపాతో కాంగ్రెస్ దోస్తీ: రఘువీరా కామెంట్స్

June 01, 2018


img

ఇటీవల కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భుజం తట్టి నవ్వుతూ మాట్లాడటంతో అయన కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దమయ్యారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తమ పార్టీకి తెదేపాతో పొత్తులు పెట్టుకోవలసిన దుస్థితిలో లేదని చెప్పడం విశేషం. 

అయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఆరోజు బెంగళూరులో రాహుల్ గాంధీ-చంద్రబాబు కాకతాళీయంగా కలిసారు అంతే. దానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. 2019 ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని మేము పనిచేస్తున్నాము. మొన్న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే దేశంలో మోడీ సర్కార్ పై ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోయిందని స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికలలో గెలిచి ఇక్కడ ఏపిలోను, అక్కడ కేంద్రంలోనూ అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాము. 

ఇక నుంచి ఏపిలో మా గేమ్ మొదలవుతుంది. నాలుగేళ్ళు నరేంద్ర మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికలకు ముందు హటాత్తుగా మాటమార్చి మోడీ వలననే రాష్ట్రం నష్టపోయిందని వాదిస్తున్నారు. కానీ నిజాలు ఏమిటో ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలను సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అది సాధ్యం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ లను జి.ఎస్.టి. పరిధిలోకి తెస్తాము. ప్రస్తుతం ఉన్న జి.ఎస్.టి. అందరికీ తీవ్ర నష్టం కలిగిస్తోంది. దానిని సవరించి అందరికీ ఆమోదయోగ్యమైన జి.ఎస్.టి.ని అమలుచేస్తాము. 

తెదేపాతో పొత్తులు పెట్టుకోవాలా వద్దా? అనే విషయంపై మా పార్టీ శ్రేణుల అభిప్రాయం సేకరిస్తున్నాము. వాటిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చించి తగిన  నిర్ణయం తీసుకుంటాము,” అని రఘువీరారెడ్డి అన్నారు.

2014 ఎన్నికలలో ఏపిలో చాలా దారుణంగా ఓడిపోయింది.  గత నాలుగేళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఏపిలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకు పోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. అప్పటి నుంచి ఏపిలో కాంగ్రెస్ పార్టీ అంటే రఘువీరా రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. కర్ణాటకలో రాజకీయ పరిణామాలు, ఉపఎన్నికల ఫలితాలతో ఆయనకు కొత్త ఉత్సాహం వచ్చినట్లుంది. బహుశః అందుకే తెదేపాతో పొత్తులు అవసరం లేదన్నట్లు మాట్లడుతున్నరేమో? కానీ వాపును చూసి బలుపు అనుకుంటే ఏమి ప్రయోజనం? ఏపిలో కాంగ్రెస్ ఎటువంటి దుస్థితిలో ఉందో కళ్ళారా చూస్తూ ఇక నుంచి ఏపిలో మా గేమ్ మొదలవుతుందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇక దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ, దేశప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పుతారనుకోవడం అత్యాసే అవుతుంది. ఇక ప్రాంతీయ పార్టీల సహకారంతో మోడీని గద్దె దింపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి  అవ్వాలనే కల కూడా నెరవేరే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.


Related Post