మన ఛాయ్ వాలాకు విదేశీయాత్రలే ఇష్టమా?

May 31, 2018


img

రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు నోట్లో వెండి చెంచాలతో పుట్టారు కనుక వారికి దేశంలో కోట్లాదిమంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల కష్టాలు, ఆశలు, కలలను అర్ధం చేసుకునే శక్తి ఉండకపోవచ్చు. కానీ నరేంద్ర మోడీ ఒకప్పుడు గుజరాత్ లోని బస్టాండులో ఛాయ్ అమ్ముకుని బ్రతికేవాడినని స్వయంగా చెప్పుకొంటారు. ఆ స్థాయి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయికి అక్కడి నుంచి దేశప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడీకి సామాన్య ప్రజల కష్టాలు, సమస్యల గురించి రాహుల్ గాంధీ కంటే బాగా తెలిసి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ అయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వంలో, వేషధారణలో, ఆలోచనలలో మార్పులు రాసాగాయి. పేదల జీవితాలలో వెలుగులు నింపుతారనుకుంటే బడా కార్పోరేట్ సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు అయన ఆప్తమిత్రుడయ్యారు. నోట్ల రద్దు వంటి నిర్ణయంతో సామాన్య ప్రజల జీవితాలను మరింత దుర్భరం చేశారు.

పేదల మద్య తిరిగి వారి సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే ఎక్కువగా విదేశాలలో తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అన్ని రాష్ట్రాలలో తిరిగి ఉండకపోవచ్చునేమో కానీ ఈ నాలుగేళ్ళలోనే ప్రపంచదేశాలన్నిటినీ చుట్టేసి వచ్చారు. 

మోడీ తీరును చూసిన డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, “తూత్తుకూడిలో అల్లర్లు జరిగి 13 మంది చనిపోతే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం చూస్తే తమిళనాడు రాష్ట్రం..దానిలో తూత్తుకూడి పట్నం భారత్ లో ఉన్నాయని అయన భావిస్తున్నారో లేదో అనే అనుమానం కలుగుతోంది,” అని విమర్శించారు. 

ఏపిసిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “నరేంద్ర మోడీ ఒక్క గుజరాత్ రాష్ట్రానికే ప్రధానమంత్రా లేక యావత్ దేశానికా? మాకు రాజధాని లేదు కట్టుకోవడానికి డబ్బు ఇమ్మని వేడుకున్నా స్పందించరు కానీ గుజరాత్ లో రూ.86,000 కోట్లతో డోలేరా అనే ఒక సరికొత్త నగరాన్ని నిర్మించుకుంటున్నారు. గుజరాత్ లో సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కేటాయించినంత సొమ్మును ఏపికి ఇవ్వడానికి ఇష్టపడరు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

నరేంద్ర మోడీ గురించి సోషల్ మీడియాలో ఒక జోక్ ప్రచారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా ఒక రాష్ట్రానికి పదేపదే వస్తున్నారంటే ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయని అర్ధం. అది నిజమేనని అయనే చాలాసార్లు నిరూపించి చూపుతున్నారు. అయన రాష్ట్రాలకు రాకపోయినా విదేశాలకు మాత్రం టంచన్ గా వెళ్ళివస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశంలో అత్యున్నతమైన పదవి చేపట్టినప్పుడు అయన సామాన్యుడిలాగానే ఆలోచించి సామాన్య ప్రజలకు మేలు చేస్తారని ఆశిస్తే అయన సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో..దూరంలో సంచరిస్తున్నారు. 


Related Post