లక్ష కాదు...40 వేల ఇళ్ళేనట!

May 31, 2018


img

తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తవుతోంది కానీ అది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఇంకా నత్తనడకలు నడుస్తూనే ఉంది. ఈ ఏడాది చివరిలోగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే లక్ష ఇళ్ళు నిర్మిస్తామని మంత్రి కేటిఆర్ పలుమార్లు చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కలిపి మరో 1.70 లక్షల ఇళ్ళు నిర్మిస్తామని చెప్పారు. 

బుధవారం బేగంపేటలోని మెట్రో భవన్ లో అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ లో 40,000 ఇళ్ళు (ఇదే వేగంతో నిర్మాణ పనులు కొనసాగినట్లయితే) పూర్తవుతాయని చెప్పారు. 2019 జూన్ నాటికి మిగిలిన 60,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. 

ఈసారి సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగా అంటే ఈ ఏడాది డిసెంబర్ లోనే జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ జరుగకపోతే షెడ్యూల్ ప్రకారం 2019 ఏప్రిల్-మే నెలలోపుగా జరుగుతాయి. కనుక తెరాస సర్కార్ తన పదవీకాలంలో హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయలేదని స్పష్టం అవుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షల ఇళ్ళు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంలో అనేకానేక సమస్యలు, అవాంతరాలు ఎదురవుతున్న మాట వాస్తవం. ఈ సంగతి ప్రభుత్వానికి ముందే తెలియదనుకోలేము. కానీ మూడేళ్ళవరకు చాలా చోట్ల పనులు మొదలుపెట్టలేకపోయింది. నేటికీ అనేకచోట్ల ఇంకా శంఖుస్థాపన దశలోనే ఉన్నాయి. 

మరో 6-10 నెలలో ఎన్నికలు పెట్టుకొని వచ్చే ఏడాది జూన్ నాటికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి కేటిఆర్ చెపుతున్నారు. అంటే తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని కేటిఆర్ చెపుతున్నట్లుగానే భావించవచ్చు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు మొదలుపెట్టడంలో చాలా ఆలస్యం జరిగినా, వాటి గురించి తెరాస అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే తెరాస నేతలు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. అంటే దానిపై తెరాస ‘అడ్వాన్స్ క్రెడిట్’ తీసుకునే ప్రయత్నం చేసిందన్నమాట! 

అధికారంలో ఉన్నవారు తాము చేసిన పనుల గురించి ఇంకా చేయబోయేవాటి గురించి కూడా గొప్పలు చెప్పుకొని ప్రజల మెప్పు  పొందాలని ప్రయత్నించడం సహజమే. తెరాసకు ఆ ప్రచారయావ మరికాస్త ఎక్కువే కనుక ఇళ్ళకు శంఖుస్థాపన చేయక మునుపే వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టేసింది. కానీ చివరికి ఆ హామీని నెరవేర్చలేకపోయినందున అందరూ దానిని ఇప్పుడు వేలెత్తి చూపే అవకాశం అదే కల్పించిందని చెప్పక తప్పదు. అంటే ‘అడ్వాన్స్ క్రెడిట్’ పొందాలని ఆశపడితే విమర్శలు ఎదుర్కోవలసివస్తోందన్న మాట! 

సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, పాసుపుస్తకాల పంపిణీ విషయంలో కూడా ఈ ప్రచారయావే తెరాసకు ఇబ్బందికరంగా మారింది. పాసుపుస్తకాలలో తప్పులు దొర్లిన కారణంగా అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

పేదప్రజలకు మేలు చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమే కానీ అవి సకాలంలో పూర్తిచేయలేమని తెలిసి ఉన్నప్పుడు కూడా వాటి గురించి అతిగా ప్రచారం చేసుకోవడం, గొప్పలు చెప్పుకోవడం తగ్గిస్తే వాటికి అనవసరమైన ‘హైప్’ క్రియేట్ అవదు. అప్పుడు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు కదా!


Related Post