ఇదే చివరి హెచ్చరికా?

May 31, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు వారి సభ్యత్వాలను ప్రభుత్వం పునరుద్దరించలేదు. కానీ శాసనసభ అధికారిక వెబ్ సైట్ లోవారిరువురూ శాసనసభ్యులుగానే చూపిస్తోంది. 

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క బుధవారం శాసనసభ కార్యదర్శిని కలిసి వారిరువురి శాసనసభ్యత్వాలను పునరుద్దరించవలసిందిగా కోరుతూ లీగల్ మెమొరాండం ఇచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయకపోవడం కోర్టు ధిక్కారణగానీ భావించవలసి వస్తుందని, కనుక ఇప్పటికైనా వారిరువురి  శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని లేకుంటే మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తామని మల్లు భట్టి విక్రమార్క కార్యదర్శిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.   

ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ పంపిన లేఖలో కూడా ఆయనను ఎమ్మెల్యేగానే పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే విషయం ప్రస్తావించి తన శాసనసభ్యత్వం ఇంకా ఎప్పుడు పునరుద్దరిస్తారని సిఎం కెసిఆర్ ను ప్రశ్నించారు. కానీ ఇంతవరకు వారి శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్ రెడ్డిని కలిసి ప్రోటోకాల్ ప్రకారం తమకు గన్ మ్యాన్ లను ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చి వచ్చారు. చివరి ప్రయత్నంగా శాసనసభ కార్యదర్శికి మల్లు భట్టి విక్రమార్క నిన్న లీగల్ మెమొరాండం ఇచ్చారు. 

ఈ కేసులో 11 మంది తెరాస ఎమ్మెల్యేలు హైకోర్టు ధర్మాసనంలో ఒక పిటిషన్ వేశారు కానీ హైకోర్టు వారి పిటిషన్ ను స్వీకరించలేదు. కనుక తెరాస సర్కార్ కూడా వెనుకంజవేసినట్లుంది. అయితే దీనిపై తెరాస సర్కార్ వెనక్కు తగ్గినప్పటికీ వారి శాసనసభ్యత్వాలను పునరుద్దరించకుండా వారిని పరోక్షంగా శిక్షిస్తున్నట్లుంది. దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడమే తెరాస నిర్ణయంగా కనిపిస్తోంది. తద్వారా వారికి సంకటపరిస్థితి కల్పించగలుగుతోంది.

ఒకవేళ వారివురూ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళినా, ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలోని అంశం కనుక హైకోర్టు కూడా ఇక జోక్యం చేసుకోకపోవచ్చు. కానీ సిఎం కెసిఆర్ వ్రాసిన లేఖలో, శాసనసభ వెబ్ సైట్ లో తమను శాసనసభ్యులుగా పేర్కొంటున్నప్పుడు తమకు జీతభత్యాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తూ వారిరువురూ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసినట్లయితే తెరాస సర్కార్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడవచ్చు. 


Related Post