నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానంటే..

May 30, 2018


img

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో గాంధీ భవన్ కు వచ్చారు. ఆ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ అవినీతిని, సిఎం కెసిఆర్ నియంతృత్వాన్ని ప్రశ్నించడానికే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. మిషన్ భగీరథలో రూ.50,000 కోట్లు అవినీతి జరిగింది. నాలుగేళ్ళుగా రైతులగోడు పట్టించుకోని సిఎం కెసిఆర్ ఇప్పుడు హటాత్తుగా రైతులపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటమే అందుకు కారణమని అందరికీ తెలుసు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు పంటరుణాలను ఒకేసారి మాఫీ చేస్తామంటే అయనలో ఆందోళన మొదలైంది అందుకే అది సాధ్యం కాదని వాదిస్తున్నారు. అయన వాదన చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఒకేసారి రూ.2లక్షలు పంటరుణాలు మాఫీ చేసి చూపిస్తాము. 

సిఎం కెసిఆర్ ఈ నాలుగేళ్ళలో రైతులకు కొత్తగా చేసిందేమీ లేదు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారు. కరువు మండలాలను ప్రకటించడానికి వెనుకాడుతున్నారు. కౌలు రైతులకు పంట పెట్టుబడి ఇవ్వకుండా భూస్వాములకు ఇస్తున్నారు. అనాలోచితంగా జోనల్ వ్యవస్థను కెలికారు. దాని వలన కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగసంఘాల నేతలతో మాట్లాడి దానిని సక్రమంగా అమలుచేస్తే మంచిది. 

వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయడం ఖాయం. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది. నేను కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకించిన దామోదర్ రెడ్డిని కలిసి మాట్లాడాను. ఇద్దరం కలిసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని కోరగా అయన సానుకూలంగా స్పందించారు,” అని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.

నాగం జనార్ధన్ రెడ్డి తెరాస సర్కార్ అవినీతిని, సిఎం కెసిఆర్ నియంతృత్వాన్ని ప్రశ్నించడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకొంటున్నప్పటికీ, భాజపాను వీడాక మరే పార్టీలో చేరేందుకు అవకాశం లేక, వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ కోసమే చేరారని అయన మాటలతోనే అర్ధం అవుతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు కూడా అయన పార్టీలోనే కొనసాగితే అయన మాటలు నిజమేనని నమ్మవచ్చు. 


Related Post