సార్...మీరు అక్కడకు వెళ్ళొద్దు: భట్టి

May 30, 2018


img

దశాబ్దాల తరబడి కాంగ్రెస్ నేతగా, కేంద్రమంత్రిగా చివరికి రాష్ట్రపతిగా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ, జూన్ 7న నాగపూర్ లో జరుగబోయే ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. 

లౌకికవాద కాంగ్రెస్ పార్టీకు చెందిన ఆయనను హిందుత్వసంస్థగా ముద్రపడిన ఆర్ఎస్ఎస్ సంస్థ తమ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించడమే విచిత్రమనుకుంటే, దాని ఆహ్వానాన్ని అయన మన్నించడం ఇంకా విచిత్రం. 

ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబందం గురించి అందరికీ తెలిసిందే. కనుక కాంగ్రెస్ నేతలు కక్కలేక మింగలేక అన్నట్లు లోలోన బాధపడుతున్నారు. కానీ అయన నిర్ణయాన్ని భాజపా నేతలు స్వాగతిస్తున్నారు.  

తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “చిరకాలం కాంగ్రెస్ పార్టీకు సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీగారు ఆర్ఎస్ఎస్ ఆహ్వానం ఎందుకు మన్నించారో తెలియదు కానీ లౌకికవాది అయిన ఆయన ఒక కరడుగట్టిన మతతత్వసంస్థ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరవడం ప్రజలు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుంది. వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ట కూడా మసకబారుతుంది. కనుక ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి చిదంబరం దీనిపై భిన్నంగా స్పందించారు. అయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారు కనుక ఆ కార్యక్రమానికి హాజరవడమే మంచిది. హిందుత్వవాదం కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా అయన వారి సిద్దాంతం ఎంత లోపభూయిష్టమైనదో, భారతదేశానికి లౌకికవాదం ఎంత అవసరమో వివరించి వారిని మార్చేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది,” అని అన్నారు. 

కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ స్పందిస్తూ, “ప్రణబ్ ముఖర్జీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎవరూ రాజకీయంగా అస్పృశ్యులు కారని అయన నిరూపించారు,” అని అన్నారు.

అయితే లౌకికవాది, కాంగ్రెస్ నేత అయిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని మన్నించి దాని సమావేశానికి హాజరవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏదో ఒకరోజు దానికి సమాధానం తప్పకుండా దొరుకుతుందని ఆశిద్దాం.


Related Post