ఆ హామీని అక్కడ అమలుచేసి చూపవచ్చు కదా?

May 30, 2018


img

ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసల మద్య పంటరుణాలు మాఫీ అంశంపై వాగ్వాదాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ రూ.2 లక్షలు చొప్పున ఒకేసారి పంటరుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. 

తెలంగాణా ఎంత ధనికరాష్ట్రం అయినప్పటికీ అది సాధ్యం కాదని సిఎం కెసిఆర్ వాదిస్తున్నారు. వారు ఏవిధంగా దానిని అమలుచేయగలరో వివరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సిఎం కెసిఆర్ అడుగుతున్న ఈ ప్రశ్నకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపొతున్నారు. అయితే చెప్పేందుకు వారికి కర్ణాటకలో ఒక మంచి అవకాశం వచ్చింది.      

ఎడ్యూరప్ప సిఎం కుర్చీలో నుంచి దిగిపోతూ కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం మెడకి పంటరుణాల మాఫీ అనే గుదిబండ తగిలించి వెళ్ళిపోయారు. నిజానికి జెడిఎస్ పార్టీ కూడా తాము ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే పంటరుణాల మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది కానీ కేవలం 38 సీట్లే గెలుచుకోగలిగింది. అయితే అదృష్టం కొద్దీ ‘తంతే బూరెల గంపలో పడినట్లుగా’ కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోయారు.  కనుక ఎన్నికలలో ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోక తప్పనిపరిస్థితి ఏర్పడింది. 

కానీ ఆ హామీని అమలుచేయలేమని గ్రహించినందునో ఏమో, “నేను ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి కాలేదు. కేవలం ‘కాంగ్రెస్ దయతోనే’ ముఖ్యమంత్రి అయ్యాను. కనుక నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి” అని కుమారస్వామి లౌక్యంగా ప్రకటించి ‘రుణాల బంతిని’ కాంగ్రెస్ కోర్టులో పడేయాలని చూశారు. 

కానీ ఎడ్యూరప్ప మళ్ళీ రంగంలో దిగి “కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలు అప్పుడే ప్రజలను మోసం చేయడానికి సిద్దం అవుతున్నాయి. పంటరుణాల మాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాము,” అని హెచ్చరించడంతో కుమారస్వామి “తూచ్.. నా ఉద్దేశ్యం అది కాదు” అంటూ సవరణ ప్రకటన విడుదల చేశారు. అది వేరే సంగతి. కనుక కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఈ పంటరుణాలు మాఫీ అంశం తొలి అగ్నిపరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది. 

కర్ణాటకలో ఇప్పుడు ఎలాగూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. కనుక ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆ పంటరుణాల హామీని అక్కడే ఒకేసారి మాఫీ చేసి చూపిస్తే బాగుంటుంది కదా?అప్పుడు తెలంగాణా ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఈ హామీపై నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం దొరుకుతుందేమో కదా? 


Related Post