రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఓ పధకం...గ్రేట్!

May 29, 2018


img

తెలంగాణా రాష్ట్రంలో చంటి పిల్లలు మొదలు విద్యార్ధులు, రైతులు, యువత, వృద్ధులు, అనాధలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఉద్యోగులు, నిరుద్యోగులు...ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక మేలు చేయాలని సిఎం కెసిఆర్ పడుతున్న తపన, తాపత్రయం చూస్తే ఎవరికైనా చాలా సంతోషం కలుగుతుంది. అధికారంలో ఉన్నవారు కేవలం పదవులు, అధికారం, రాజకీయాలకే పరిమితం కాకుండా మానవీయ దృక్పధంతో ఆలోచించగలిగితే ఏమి చేయవచ్చో సిఎం కెసిఆర్ నిరూపించి చూపుతున్నారు. 

నిరుపేద ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్ధిక సహాయం అందుతోంది. గర్భవతులైన పేద మహిళలకు అమ్మ ఒడి-కెసిఆర్ కిట్స్ ద్వారా లభ్ది పొందుతున్నారు. నిరుపేద కిడ్నీ రోగుల కోసం జిల్లాకు ఒకటి చొప్పున ఉచిత డయాలసిస్  సెంటర్లు (రక్తశుద్ది కేంద్రాలు) ఏర్పాటయ్యాయి. విద్యార్ధులకు పుస్తకాలు, ఆరోగ్య పరీక్షలు, పౌషికాహారం, హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్, ఫీజ్-రీఇంబర్స్ మెంట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, విదేశాలలో చదువులకు ఆర్ధిక సహాయం లభిస్తోంది.       

రైతుల కోసం నిరంతర ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి అందిస్తోంది ప్రభుత్వం. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వేలకోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. మరోపక్క మిషన్ కాకతీయ పధకంలో భాగంగా రాష్ట్రం చెరువులలో పూడికలు తీయించి వాటిని మంచి నీటితో నింపుతోంది. ఆ చెరువులలో చేపపిల్లలను వదిలిపెట్టి మత్సకారులకు ఉపాధి అవకాశం కల్పిస్తోంది. 

గొల్ల,కురుములను ఓటు బ్యాంక్ గా కాకుండా ఒక గొప్ప మానవవనరుగా గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కెసిఆరే అని చెప్పక తప్పదు. రాష్ట్రానికి ఐటి రంగం ఒక్కటే ప్రధాన ఆదాయవనరు కాదని మారుమూల గ్రామాలలో నివసిస్తున్న ఆ గొల్లకురుములకు గొర్రెలను అందిస్తే వారు కూడా రాష్ట్రానికి గొప్ప సంపద సృష్టించగలరని చాటి చెప్పారు. 

ఇక  జూన్ మొదటివారంలో రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీల భర్తీకి టి.ఎస్.పి.ఎస్.సి.వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.               

జూన్ లో ప్రభుత్వపాఠశాలలు మళ్ళీ తెరవగానే అర్హులైన విద్యార్ధినులకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్, విద్యార్ధులు అందరికీ స్కూలు యూనిఫారంలు అందించడానికి విద్యాశాఖ సన్నాహాలు చేసుకుంటోంది. విద్యార్ధులలో రక్తహీనత లోపాన్ని నివారించదానికి అందరికీ ప్రతీరోజు మటన్, చికెన్, కోడిగుడ్లతో కూడిన ఆహారం అందించదానికి కూడా చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. 

మరోపక్క రాష్ట్ర వ్యవసాయశాఖ ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున జీవితభీమా పత్రాలను అందించడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకొంటోంది. 

ఆగస్ట్ 15 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది.

కెసిఆర్ సర్కార్ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పధకాలన్నిటి గురించి వ్రాయాలంటే ఒక పుస్తకం సరిపోదు కనుక ఇది కొండను అద్దంలో చూపే చిన్న ప్రయత్నమే.  

ఈవిధంగా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకవిధంగా మేలు చేయాలని సిఎం కెసిఆర్ పడుతున్న తపన, తాపత్రయం చూస్తున్నప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన మహేష్ బాబు విలేఖరులను ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు గుర్తుకువస్తే ఆశ్చర్యం లేదు. “చిత్తశుద్ధితో పనిచేస్తే కేవలం 8 నెలలోనే అద్భుతాలు చేయవచ్చు. ఎటువంటి సమస్యలనైనా చిటికె వేసినట్లు పరిష్కరించవచ్చు. అదే ఐదేళ్ళు..పదేళ్ళు చేస్తే ఇంకెన్ని సాధించవచ్చో...” అనే మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగులు మీరూ వినండి. వాటిని సిఎం కెసిఆర్ కు అక్షరాల సరిపోతాయని మీరు కూడా అంగీకరించకుండా ఉండలేరు! 

 

Related Post