ఇక తెలంగాణాపై కాంగ్రెస్ గురి?

May 29, 2018


img

రాష్ట్ర విభజన తరువాత ఏపిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది కానీ తెలంగాణాలో మాత్రం నేటికీ చాలా బలంగా నిలబడగలిగింది. 2014 ఎన్నికలలో స్వీయ తప్పిదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అందరికీ తెలుసు. కనుక 2019 ఎన్నికలలో అవి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది. రెండు రోజుల క్రితమే రాష్ట్ర డిసిసి అధ్యక్షుల నియామకాల ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా రామచంద్ర కుంతియా తీరు పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నందున, ఆ బాధ్యతలు గులాం నబీ ఆజాద్ కు అప్పగించి, కుంతియాను ఆయన క్రింద ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా సమాచారం. 

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగల అవకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. కనుక బస్సు యాత్రలు చేస్తూ తెరాస సర్కార్ ను బలంగా డ్డీ కొంటున్నారు. ఈసారి ఎన్నికలకు ఆరేడు నెలలు ముందుగానే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక తెదేపా కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు సిద్దపడుతుండటం, కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూల పరిణామమే.     

కనుక కీలకమైన ఈ సమయంలో తెలంగాణా రాష్ట్ర వ్యవహారాలపై, రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై మంచి పట్టున్న గులాం నబీ ఆజాద్ కు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజులలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post