మోత్కుపల్లికి లైన్ క్లియర్...ఇప్పుడేంచేస్తారో?

May 28, 2018


img

టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులుని పార్టీలో నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం ప్రకటించారు. గత కొంతకాలంగా మోత్కుపల్లి చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించేవిధంగా ఉందని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరిస్తునందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎల్.రమణ మీడియాకు తెలియజేశారు. 

గత ఏడాది ఎన్టీఆర్ జయంతి రోజున మోత్కుపల్లి నరసింహులు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, తెదేపాను తెరాసలో విలీనం చేసేయాలని చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చేరు. అప్పటి నుంచి పార్టీ నేతలు అందరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ అయన పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఇంతకాలం అయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ అవకాశాన్ని అయన సద్వినియోగం చేసుకుని మళ్ళీ తెదేపాతో కలిసిపోయేందుకు ప్రయత్నించి ఉంటే ఏమయ్యేదో కానీ ఆయన అటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఆయనకు పార్టీకి మద్య ఆ దూరం అలాగే ఉండిపోయింది. 

ఆ కారణం చేతనే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మహానాడుకు ఆయనను ఆహ్వానించలేదు. దాంతో మోత్కుపల్లి ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆ ఆవేశంలో ‘చంద్రబాబు తక్షణం తెదేపాను ఎన్టీఆర్ కుటుంబానికి తిరిగి అప్పగించి, ముఖ్యమంత్రి   పదవిలో నుంచి దిగిపోవాలని’ మోత్కుపల్లి డిమాండ్ చేశారు. పార్టీలో ఒక నాయకుడిని బహిష్కరించడానికి ఇంతకంటే బలమైన కారణం అవసరం లేదు కనుక మోత్కుపల్లిపై వేటు పడింది. 

అయన గత కొంతకాలంగా తెరాసకు దగ్గరయ్యే ప్రయత్నంలో సిఎం కెసిఆర్ ను చాలా పొగుడుతున్నారు. ఇప్పుడు తెదేపాలో నుంచి బయటకు వచ్చేశారు కనుక మోత్కుపల్లికి తెరాస ఆహ్వానం పలుకుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఆహ్వానించకపోతే మోత్కుపల్లి వేరే ఏ పార్టీలోను ఇమడలేరు కనుక ఎల్.రమణ చెప్పినట్లుగా అయన రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే. 


Related Post