తెదేపాను ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలి: మోత్కుపల్లి

May 28, 2018


img

టిటిడిపిలో అందరి కంటే సీనియర్ నేతైన మోత్కుపల్లి నరసింహులు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొనే దిశలో ఇవాళ్ళ మరో ముందడుగు వేశారు. అయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఎన్టీఆర్ హయం నాటి తెదేపాకు, ఇప్పటి తెదేపాకు చాలా తేడా ఉంది. అప్పుడు నిబద్దత కలిగిన నేతలు, కార్యకర్తలతో పార్టీ నడిస్తే, ఇప్పుడు కులం, డబ్బు ఆధారంగా నడుస్తోంది. తెదేపాను అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు, పార్టీని తక్షణమే ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు అప్పగించాలి. పార్టీనే నమ్ముకున్న నావంటి వారికీ అయన ద్రోహం చేశారు. తనను నమ్మి అధికారం కట్టబెట్టిన ఏపి ప్రజలకు ద్రోహం చేశారు. కనుక చంద్రబాబు నాయుడు తక్షణమే తన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. ఒకవేళ తప్పుకోకుంటే వచ్చే ఎన్నికలలో ఆయనని ఓడించాలని ఏపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

మోత్కుపల్లి వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చాలా ధీటుగా స్పందించారు. “మోత్కుపల్లికి చంద్రబాబు నాయుడు పార్టీలో చాలా గౌరవం ఇచ్చారు. కానీ అయన దానిని నిలబెట్టుకోలేకపోయారు. ఆయనకు గవర్నర్ పదవి ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. ఆ దుగ్ధతోనే మోత్కుపల్లి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సిఎం కెసిఆర్ ను ఎన్టీఆర్ తో పోల్చినందుకు సిగ్గుపడాలి. ఎన్టీఆర్ అభిమానులే మోత్కుపల్లికి తగినవిధంగా బుద్ధి చెపుతారు. ఆయనకు తెరాసలో చేరాలనుకుంటే చేరవచ్చు. మాకేమీ అభ్యంతరం లేదు. మోత్కుపల్లికి తెదేపాలో రోజులు ముగిసినట్లే ఉన్నాయి,” అని అన్నారు.      



Related Post