అక్కడ భాజపా..ఇక్కడ కాంగ్రెస్! దొందూ దొందే..

May 28, 2018


img

కర్ణాటక రాష్ట్ర ప్రజలు తిరస్కరించినప్పటికీ కేవలం 38 సీట్లు సాధించిన జెడిఎస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం, కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి లభించడం గొప్ప విషయమే. మేఘాలయలో భాజపా కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు గెలుచుకొంది. కానీ అక్కడ 19 సీట్లు గెలుచుకున్న ఎన్.పి.పి.తో చేతులు కలిపి భాజపా అధికారంలోకి వచ్చింది. అంటే అక్కడ భాజపా ఏమి చేసిందో ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అదే చేసిందన్నమాట! అధికారం కోసం జరిగే పోటీలో దొందూ దొందేనని నిరూపించుకున్నాయి. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని అందరికీ తెలుసు. కానీ అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయాలలో ఇటువంటివి కూడ సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయాయి.

ఇక పంటరుణాల మాఫీ కూడా ఇప్పుడు అన్ని పార్టీల మ్యానిఫెస్టోలో తప్పనిసరిగా చేర్చవలసిన అంశంగా మారిపోయింది. జెడిఎస్ కూడా చేర్చింది కానీ కాంగ్రెస్ చేర్చలేదు. కాంగ్రెస్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి చెప్పారు. అంటే పంటరుణాల మాఫీ అమలుకు కాంగ్రెస్ పార్టీ అనుమతి అవసరం అని చెప్పకనే చెప్పారు. 

ఎడ్యూరప్ప సిఎం పదవిలో నుంచిదిగిపోతూ కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం మెడకు ఒక గుదిబండ తగిలించిపోయాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో పంటరుణాలన్నీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మరునాడు పదవిలో నుంచి దిగిపోయారు. కనుక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి కూడా ఆ హామీని నేవేర్చక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. నెరవేర్చలేకపోతే రాజీనామా చేస్తానని కుమారస్వామి చెప్పడం రైతులకు భరోసా కల్పిస్తున్నట్లు పైకి కనబడుతోంది కానీ అది కాంగ్రెస్ పార్టీని బెదిరించడం కోసమేనని భావించవచ్చు. 

ఈవిధంగా అధికారం కోసం నోటికి వచ్చినట్లు హామీలు గుప్పించడం, వచ్చాక వాటిని అమలుచేయలేక అవస్థలు పడటం, చివరికి సామాన్య ప్రజలపైనే ఆ భారం మోపి వాటిని అమలుచేయలనుకోవడం అన్నీ అంతులేని విషవలయంగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది. 


Related Post