నేడు ప్రధానితో కెసిఆర్, కుమారస్వామి భేటీ!

May 28, 2018


img

కర్ణాటకలో భాజపాకు ఎదురుదెబ్బ తినిపించిన తెలంగాణా, కర్ణాటక ముఖ్యమంత్రులు కెసిఆర్,  కుమారస్వామి సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతుండటం విశేషం.

జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరేందుకు సిఎం కెసిఆర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలువబోతున్నారు. అందుకోసం అయన ఆదివారం సాయంత్రమే డిల్లీ బయలుదేరివెళ్ళారు. 

ఇక ఎడ్యూరప్ప ను గద్దె దించి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించేందుకు డిల్లీ చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి అపాయింట్ కూడా ఇచ్చారు. మంత్రి పదవుల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదాలున్న మాట వాస్తవమని కానీ అది తన ప్రభుత్వం పడిపోయేంత తీవ్రస్థాయిలో లేవని కుమారస్వామి స్వయంగా చెప్పారు. ఈ నేపద్యంలో ఆయన మోడీతో భేటీ కాబోతున్నారు. విశేషమేమిటంటే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరూ ప్రస్తుతం డిల్లీలో లేరు. వారిరువురూ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కుమారస్వామి డిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అవడం విశేషం.

ఇక జోనల్ వ్యవస్థలో మార్పులు చేసేసిన తరువాత రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ లను కోరాలనుకోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ వారు అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటి? అంగీకరిస్తే కెసిఆర్-మోడీ బంధం బలంగా ఉన్నట్లే కదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.      

ప్రధాని మోడీ-కెసిఆర్-కుమారస్వామిల సమావేశాలు ఒకేరోజు జరుగుతుండటం యాదృచ్చికమే కావచ్చు కానీ అదే అనుమానాలకు తావిస్తోంది. వారు చెపుతున్న కారణాలకే వారి సమావేశాలు పరిమితం అవుతాయా లేక సరికొత్త రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. 


Related Post