పొత్తులు అనివార్యంగా మారాయి: భట్టి విక్రమార్క

May 28, 2018


img

టి-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు. ఖమ్మం పట్టణంలో ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో నేను లోక్ సభకు పోటీ చేయాలనుకోవడం లేదు. స్థానిక ప్రజల అవసరాలు తీర్చేందుకు మళ్ళీ శాసనసభకే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈరోజుల్లో అన్ని రాజకీయపార్టీలకు పొత్తులు అనివార్యంగా మారాయి. మా కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే పొత్తుల విషయంలో జాతీయస్థాయిలోనే నిర్ణయం జరుగుతుంది,” అని చెప్పారు. 

ఇదేమీ అసాధారణ విషయం కాదు. కానీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తునందున తెలంగాణాలో తెదేపాతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని అయన సూచిస్తున్నట్లుంది. ఎందుకంటే తెలంగాణాలో ప్రధాన పార్టీలు భాజపా, సిపిఎం, మజ్లీస్ పార్టీలతో పొత్తులకు అవకాశం లేదు. ఇక మిగిలింది సిపిఐ, తెదేపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సిపిఐతో పొత్తులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కొత్తగా సాధించేదేమీ ఉండబోదు కనుక తెదేపాతో పోత్తులకు ప్రయత్నించవచ్చు. చంద్రబాబు నాయుడుకి ఆప్తుడైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన రెండు పార్టీల పొత్తులకు మార్గం ఏర్పరచవచ్చు. 

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మహానాడు సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో తెరాసను గద్దె దించడంకోసం భావస్వారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకొంటాము,” అని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు భట్టి విక్రమార్క, తెదేపాకు చెందిన ఎల్.రమణ ఇద్దరూ చెపుతున్నది ఒకటే కదా! కనుక వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్-తెదేపాల పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందనే భావించవచ్చు. 


Related Post