ప్రపంచశాంతికి అమెరికా ఏమి చేస్తుందంటే...

May 25, 2018


img

ఒకప్పుడు బ్రిటన్ గొప్పదనం గురించి ‘రవి అస్తమించని సామ్రాజ్యం’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అమెరికా గొప్పదనం గురించి చెప్పుకోవాలంటే అది ప్రపంచంలో ఏదో ఒక దేశంలో నిత్యం యుద్ధంలో మునిగితేలుతూనే ఉంటుందని చెప్పుకోవాలసి వస్తుంది. కానీ అమెరికా ఎక్కువగా ఉపయోగించే పదం ‘ప్రపంచశాంతి!’ ప్రపంచంలో శాంతి నెలకోల్పేందుకే దాని కోసమే తాము నిత్యం యుద్ధాలు చేస్తున్నామని అమెరికా సమర్ధించుకొంటుంది. 

అది ఇరాక్ తో యుద్ధం చేసింది. కానీ అక్కడ శాంతి నెలకొనకపోగా పరిస్థితులు ఇదివరకు కంటే దారుణంగా మారాయి. అమెరికా వేలుపెట్టిన ప్రతీదేశంలోను అదే పరిస్థితి ఏర్పడటం అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా ఇదంతా ప్రపంచశాంతి కోసమేనని ఆనాటి బుష్ దొరలు మొదలు నేటి ట్రంప్ దొర వరకు అందరూ నమ్మబలుకుతుంటారు. 

ఇంతకీ విషయం ఏమిటంటే, డోనాల్డ్ ట్రంప్ కంటే తిక్క మనిషి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అమెరికాపై అణ్వాయుధాలు ప్రయోగించి ప్రపంచపటంలో అమెరికా లేకుండా చేస్తానని బెదిరించిన కిమ్ జోంగ్ ఉన్, అకస్మాత్తుగా వెనక్కు తగ్గి అమెరికాకు స్నేహహస్తం అందించారు. ఇకపై తమ దేశంలో అణ్వస్త్రపరీక్షలు నిర్వహించబోనని ఏకపక్షంగా ప్రకటించారు. చెప్పడమే కాకుండా అంతర్జాతీయ మీడియా సమక్షంలో అణ్వస్త్రపరీక్షలు నిర్వహించే స్థావరాలను ద్వంసం చేశారు. తను బద్ధశత్రువుగా భావించే దక్షిణ కొరియాకు వెళ్లి ఆదేశపు అధ్యక్షుడితో చర్చలు జరిపారు. జూన్ 12న సింగపూర్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు అంగీకారం తెలిపారు. 

కిమ్ జోంగ్ ఉన్ లో హటాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో తెలియదు కానీ అమెరికా వల్లె వేసే ‘ప్రపంచ శాంతి’ కి అయన చర్యలు దోహదపడతాయని అర్ధం అవుతూనే ఉంది. కనుక అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాలు అయన నిర్ణయాలను స్వాగతించాయి. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా నిన్నటి వరకు సింగపూర్ లో కిమ్ జోంగ్ ఉన్ తో చర్చలకు సిద్దమని చెపుతూనే వచ్చారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ లో ఏవిధంగా హటాత్తుగా అనూహ్యమైన మార్పు వచ్చిందో, ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఆలోచనలోను అదేవిధంగా అనూహ్యమైన మార్పు వచ్చింది. సింగపూర్ లో జూన్ 12న జరుగబోయే సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. 

కిమ్ జోంగ్ ఉన్ లో మార్పు రావడానికి కారణాలు తెలియనట్లే డోనాల్డ్ ట్రంప్ లో వచ్చిన ఈ హటాత్ మార్పుకు ప్రత్యక్ష కారణాలు ఏవీ కన్పించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కిమ్ జోంగ్ ఉన్ కు ఒక లేఖ వ్రాశారు. దానిలో “ఇటీవల ప్రకటనలలో మీరు అమెరికా పట్ల ఎనలేని ఆగ్రహం, బహిరంగ వైరం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపద్యంలో ఇటువంటి కీలకమైన సమావేశం జరపడం సరికాదని భావిస్తున్నాను. అందుకే సింగపూర్ లో జరుగవలసిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకొంటున్నాను. ప్రపంచం...ముఖ్యంగా ఉత్తర కొరియా సుస్థిర శాంతి, సౌకర్యాలను, గొప్ప సంపదను పొందే అవకాశం కోల్పోయింది. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుంటే వీలును బట్టి తరువాత సమావేశం అయ్యేందుకు ప్రయత్నిద్దాము,” అని వ్రాశారు. 

డోనాల్డ్ ట్రంప్ వ్రాసిన ఈ లేఖ అయన తాజా నిర్ణయం గమనిస్తే ‘ప్రపంచశాంతి’ పట్ల అమెరికా ద్వందవైఖరి అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యుద్ధం జరుగుతూ ఉంటేనే అమెరికా కర్రపెత్తనం చేయగలదు. అందుకే అది ప్రపంచశాంతి పేరిట ఆపకుండా యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. యుద్దాలు జరుగుతుంటేనే అమెరికాలోని యుద్దపరికరాలు తయారుచేసే సంస్థలకు చేతి నిండా పని, డబ్బు లభిస్తాయి. బహుశః అందుకే ప్రపంచంలో మిగిలినదేశాల కంటే అమెరికాకు ‘ప్రపంచశాంతి’ చాలా అవసరమవుతోంది.    



Related Post