పిలవలేదు అందుకే వెళ్ళలేదు: మోత్కుపల్లి

May 24, 2018


img

మోత్కుపల్లి నరసింహులు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “మహానాడు సమావేశానికి నన్ను చంద్రబాబు నాయుడు ఆహ్వానించలేదు. అందుకే నేను దానికి వెళ్ళలేదు. ఎన్టీఆర్ ప్రియశిష్యుడినైన నన్ను తెదేపాకు దూరంగా పెట్టడం నన్ను చాలా బాధిస్తోంది. తెలంగాణాలో తెదేపా క్యాడర్ ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే నేను ఆరోజు తెరాసలో తెదేపాను విలీనం చేయాలని అన్నాను. కానీ నా మాటలను చంద్రబాబు నాయుడు తప్పుగా అర్ధం చేసుకొని ఆరోజు నుంచి నన్ను పార్టీకి దూరంగా పెట్టారు. కనీసం నా సంజాయిషీ వినడానికి కూడా అయన ఇష్టపడలేదు. అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. తెదేపాను బలోపేతం చేయడానికి నేను రేయింబవళ్ళు పనిచేశాను. కానీ చివరికి నన్నే పక్కనపెట్టేశారు. నన్ను పిలవకుండానే మహానాడు నిర్వహించేరు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది,” అని అన్నారు. 

ఒక పార్టీ మరొక పార్టీతో పొత్తులు పెట్టుకోవాలంటేనే పార్టీలో అంతర్గతంగా లోతుగా చర్చించుకొన్నాక నిర్ణయాలు తీసుకొంటారు. అటువంటిది ఏకంగా తెదేపాను తెరాసలో విలీనం చేసేస్తే మంచిదని మోత్కుపల్లి బహిరంగంగా ప్రకటించారు. అటువంటి ప్రకటనలను తెదేపాయే కాదు ఏ పార్టీ కూడా జీర్ణించుకోవడం కష్టమే. అందుకే అయనను తెదేపా దూరంగా ఉంచింది. 

ఆ కారణంగా అయన ఇప్పుడు తెరాస వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెరాసలో ఇప్పటికే ‘హౌస్ ఫుల్’ అయిపోయుంది. వచ్చే ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ ఇస్తామని సిఎం కెసిఆర్ ఎప్పుడో ప్రకటించేశారు. కనుక మోత్కుపల్లి తెరాసలో చేరినా టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కనుక దానిలో చేరలేరు. మిగిలింది భాజపా లేదా తెలంగాణా జనసమితి, బిఎల్ఎఫ్ మాత్రమే కనిపిస్తున్నాయి. మరి మోత్కుపల్లి ఏ పార్టీలో చేరుతారో చూడాలి.


Related Post