మహానాడుకు వారిద్దరూ డుమ్మా

May 24, 2018


img

ఇవాళ్ళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెదేపా మహానాడు సమావేశం జరుగుతోంది. తెదేపాకు అది ఎంత ముఖ్యమైన కార్యక్రమమో అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమానికి పార్టీలో అత్యంత సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు డుమ్మా కొట్టారు. అలాగే గత ఎన్నికలలో తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పేర్కొనబడిన ఆర్.కృష్ణయ్య కూడా డుమ్మా కొట్టారు. 

గవర్నర్ పదవి లభిస్తుందనే ఆశతో మోత్కుపల్లి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ తనకు ఆ అవకాశం లేదని గ్రహించిన తరువాత మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. అదే సమయంలో తెదేపా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి సూచించారు. (అది చంద్రబాబు ఆలోచనే అని ఇప్పుడు తేలింది.) కానీ అది గ్రహించలేక రేవంత్ రెడ్డి ప్రతిపాదనను మోత్కుపల్లి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగి ఉండి ఉంటే బాగుండేది కానీ తెదేపాను తెరాసలో విలీనం చేసేస్తే బాగుంటుందని నోరుజారి పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత అయన క్షమాపణలు చెప్పుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయనను పట్టించుకోలేదు. ఆ కారణంగా పార్టీ నేతలు కూడా పట్టించుకోలేదు. ఆవిధంగా మోత్కుపల్లి తెదేపాకు దూరం అయ్యారు. గవర్నర్ అవుదామని కలలు కంటే ఇప్పుడు కనీసం పార్టీలో స్థానం లేకుండా చేసుకున్నారు. అందుకు అయన తనను తానే నిందించుకోక తప్పదు.

ఇక ఆర్.కృష్ణయ్య విషయంలో తెదేపా చాలా అనుచితంగా ప్రవర్తించిందని చెప్పక తప్పదు. తెలంగాణాలో జనాభాలో బిసిల శాతమే ఎక్కువ కనుక ఆ బిసీల నాయకుడు ఆర్.కృష్ణయ్యను ముందుంచుకొని ఎన్నికలకు వెళ్ళినట్లయితే బిసిల ఓట్లు గంపగుత్తగా తెదేపాకే పడిపోతాయని చంద్రబాబు నాయుడు భావించారు. అందుకే 2014 ఎన్నికలకు ముందు కృష్ణయ్యను పార్టీలోకి తీసుకొని తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేశారు. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఎన్నికలైపోగానే చంద్రబాబు తన అలవాటు ప్రకారం కృష్ణయ్యను పులిహోరలో కరివేపాకులా తీసి పక్కనపడేశారు. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో పార్టీలో నేతలు కూడా కృష్ణయ్యను పట్టించుకోలేదు. ఆ కారణంగా కృష్ణయ్య తెదేపాకు దూరం అయ్యారు. అందుకే అయన కూడా మహానాడుకు డుమ్మా కొట్టారు. 

2014 ఎన్నికలలో తెలంగాణాలో తెదేపా ఓడిపోయినప్పటికీ, బిసిలలో మంచి ఆదరణ ఉన్న కృష్ణయ్యకు పార్టీలో, సముచిత గౌరవం కల్పించి ఉండి ఉంటే, తెదేపా పట్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్ల బిసిలకు గౌరవం ఉండేది. అది ఎన్నికల సమయంలో తెదేపాకు చాలా ఉపయోగపడి ఉండేది. కానీ ఎన్నికలైపోగానే కృష్ణయ్యను పులిహోరలో కరివేపాకులా తీసి పక్కనపడేసి తెదేపా చాలా తప్పు చేసిందనే చెప్పకతప్పదు. 


Related Post