తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపాలు దోస్తీ షురూ?

May 24, 2018


img

కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్సుకొని కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుట్టారు కనుక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దపడవచ్చు.

ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగబోతున్న టిడిపి మహానాడు సమావేశానికి హాజరవుతున్న చంద్రబాబునాయుడు తన తెలంగాణా తెదేపా నేతలకు అందుకు అనుగుణంగా దిశానిర్దేశం చేయవచ్చు. చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకస్తుడైన నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కనుక అయన ద్వారా రెండు పార్టీల అనుసంధానం జరిపించవచ్చు. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొనే ఆలోచన ఉన్నందునే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఆ పార్టీలోకి పంపించారా? అనే సందేహం కలుగుతోంది. 

తెలంగాణాలో తెదేపా బలహీనపడినప్పటికీ నేటికీ తెదేపాకు బలమైన క్యాడర్ ఉంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం, బలమైన క్యాడర్ ఉన్నాయి. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపాలు చేతులు కలిపినట్లయితే, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి వచ్చే ఎన్నికలలో తెరాసకు గట్టి పోటీనీయవచ్చు.

అయితే కాంగ్రెస్-తెదేపాల పొత్తులకు ఆ రెండు పార్టీలలోను కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం వలన వచ్చే ఎన్నికలలో దానికీ కొన్ని సీట్లు పంచి ఈయవలసి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఆశిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. తెదేపాతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకొంటే వారికి కోత విదించవలసి వస్తుంది. ఇక తెదేపాలో మోత్కుపల్లి నరసింహులు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో పొత్తులను గట్టిగా వ్యతిరేకించవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇంతకంటే వేరే గత్యంతరం కనబడటం లేదు.

ఒకవేళ తెలంగాణాలో కాంగ్రెస్-తెదేపాలు పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడినట్లయితే, ఇంతకాలం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కెసిఆర్ చేసిన ప్రయత్నాలు తెరాసకు కాక తెదేపాకు లబ్ది కలిగించినట్లవుతుంది. అయన కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని భావిస్తే, కుమారస్వామి పుణ్యామాని కాంగ్రెస్-తెదేపాలు దగ్గరయ్యేందుకు అవకాశం కలిగింది. 


Related Post