రాహుల్ గాంధీకి చంద్రబాబు షేక్ హ్యాండ్!

May 23, 2018


img

రాజకీయాలలో ఎవరూ శాశ్విత మిత్రులు ఉండరని తెదేపా-భాజపా-జనసేన పార్టీలు నిరూపించి చూపగా, అలాగే శాశ్విత శత్రువులు కూడా ఉండరని బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నిరూపించి చూపారు. 

అది కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమమే అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీల షేక్ హ్యాండ్ అందరిని దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. వారిరువురూ మీడియా సమక్షంలోనే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ,  అజిత్ సింగ్ (ఆర్.ఎల్.డి), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లీస్), తేజస్వీ యాదవ్ (ఆర్.జె.డి), సీతారాం ఏచూరి (సీపీఎం జాతీయ కార్యదర్శి), అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ) ఇంకా అనేకమంది ప్రముఖ రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. అది తమ ఐక్యతను భాజపాకు చాటి చెప్పడం కోసమేనని అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయబోతున్న ప్రాంతీయ పార్టీలు ఈ వేదికపై నుంచి ఆ విషయాన్ని భాజపాకు చాటి చెప్పినట్లు భావించవచ్చు. 

ఏపి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందిస్తూ, “నిజానికి ప్రతిపక్షాలు ఈవిధంగా చేతులు కలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీయే అవకాశం కల్పించారని చెప్పవచ్చు. ఆయన నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడల కారణంగానే ప్రతిపక్షాల మద్య ఈ ఐక్యత సాధ్యం అయ్యింది. ఈరోజు బెంగళూరులో జరిగిన ఈ తాజా రాజకీయ కలయికలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలలో మార్పులకు సంకేతంగా భావించవచ్చు,” అని అన్నారు. అంటే భవిష్యత్ లో కాంగ్రెస్-తెదేపాలు కలిసి పనిచేసే అవకాశం ఉందని చెపుతున్నట్లే భావించవచ్చు. చంద్రబాబు నాయుడు-రాహుల్ గాంధీ కూడా అదే సూచిస్తున్నారు కదా!


Related Post