ఫ్రంట్ ను చంద్రబాబు హైజాక్?

May 23, 2018


img

సిఎం కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ను ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఎత్తుకుపోబోతున్నారా?అంటే అవుననే అనిపిస్తోంది. 

ఇవాళ్ళ బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, మాయావతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన కుమారస్వామి, మమతా బెనర్జీ, మాయావతితో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి రావలసిన అవసరముంది. వచ్చే ఎన్నికలలో మేము జెడిఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాము. అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని పోటీ చేసినట్లయితే, భాజపాను ఎదుర్కోవచ్చు,” అని అన్నారు. మమతా బెనర్జీ కూడా అయనతో ఏకీభవిస్తూ మాట్లాడటం విశేషం. 

జెడిఎస్ తో కలిసి పనిచేసేందుకు తెదేపా సిద్దంగా ఉంది అంటే దానర్ధం దాని సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పనిచేయడానికి తెదేపా సిద్దంగా ఉందని చెప్పడంగానే భావించవచ్చు. కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్, భాజపాలు రెంటికీ సమానదూరంలో ఉంటుందని చెపుతున్నారు. భాజపాకు దూరంగా ఉండేందుకు ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండలేమని కుమారస్వామి (జెడిఎస్), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), మాయావతి (బి.ఎస్.పి.), అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), కనిమోలి (డిఎంకె) చెపుతున్నారు. కనుక కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టంగానే కనిపిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి తెదేపాకు అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. కనుక అవన్నీ కలిసి చంద్రబాబు సారద్యంలో ఓ ఫ్రంట్ గా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే అది కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ప్రత్యామ్నాయంగా మారినా ఆశ్చర్యం లేదు.     



Related Post