కర్ణాటక నుంచే మోడీకి ఎదురుగాలి మొదలైందా?

May 23, 2018


img

2014 ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ హయంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయిన దేశాన్ని నరేంద్ర మోడీ అయితేనే మళ్ళీ గాడిన పెట్టగలరని దేశ ప్రజలు నమ్మి, కేవలం ఆయన మొహం చూసే భాజపాకు ఓటు వేసి గెలిపించారు. ఆ తరువాత ప్రజల అంచనాల మేరకు నరేంద్ర మోడీ పాలనలో అనేక సంస్కరణలు చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశప్రజల మనసులు దోచుకున్నారు. 

ఆ తరువాత నోట్లరద్దు, జి.ఎస్.టి.వంటి నిర్ణయాల కారణంగా దేశప్రజలలో మోడీ పట్ల వ్యతిరేకత మొదలైంది. నిజానికి నోట్లరద్దు చేసినప్పుడు కూడా అది దేశహితం కోసం మోడీ తీసుకున్న నిర్ణయంగా భావించి దేశప్రజలు ఆయనను సమర్ధించారు. నోట్లకష్టాలను పంటి బిగువున భరిస్తూ ఆయనకు మనస్పూర్తిగా సహకరించారు. కానీ నోట్లరద్దు వలన సామాన్యులకు మేలు కలుగకపోగా వారి కష్టాలు ఇంకా పెరిగిపోయాయి. అదేసమయంలో బడాబాబుల ఇళ్ళలో వందలకోట్లు కొత్త కరెన్సీ నోట్ల పెట్టెలు బయటపడ్డాయి. ఆ తరువాత వరుసగా బ్యాంకులకు కుచ్చుటోపీలు పెట్టినవారి భాగోతాలు బయటపడ్డాయి. ఇవి సరిపోవన్నట్లు దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు వంటి సంఘటనలు ఒక అంటువ్యాధిలా మొదలయ్యాయి. 

ఇక గోవా, ఈశాన్య రాష్ట్రాలలో, తాజాగా కర్ణాటకలో అధికారం కోసం భాజపా ఆడిన రాజకీయ చదరంగం, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా భాజపా పట్ల ప్రజలలో కొంత వ్యతిరేకత మొదలైందని చెప్పకతప్పదు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట మసకబారిందని చెప్పకతప్పదు. 2014 ఎన్నికలలో అయనకున్న అపూర్వమైన ప్రజాధారణ కారణంగానే భాజపా ఘనవిజయం సాధించింది. కానీ ఇప్పుడు రాజకీయ వ్యూహాలతోనే భాజపాను గట్టెక్కించవలసివస్తోందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

2014 ఎన్నికల నాటికి, నేటికీ అయన పాపులారిటీ గ్రాఫ్ లో చాలా తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు మోడీ పేరు చెపితే గలగలా ఓట్లురాలేవి కానీ ఇప్పుడు కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ భాజపాకు విజయం సాధించి పెట్టలేకపోయారు. 

ఇక కర్ణాటకలో భాజపాను నిలువరించి మళ్ళీ అధికారం దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. ఇదే ఊపుతో 2019 ఎన్నికలలో కూడా భాజపాను అడ్డుకొని కేంద్రంలో మళ్ళీ అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది. కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. నేడు కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం రోజునే దేశంలో భాజపాను వ్యతిరేకించే పార్టీలను కూడగట్టడానికి కాంగ్రెస్ శ్రీకారం చుడుతోంది. ఇక ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు నాయుడు కూడా వచ్చే ఎన్నికలలో భాజపా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు. కనుక 2019 ఎన్నికలలో గెలవడానికి భాజపా మరింత చెమటోడ్చవలసిరావచ్చు. 


Related Post