రజనీకాంత్ తొలి తప్పటడుగు!

May 21, 2018


img

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా రాజకీయాలలోకి ప్రవేశించక ముందే ఒక తప్పటడుగు వేశారు. అయన నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్య విజయమని చెపుతూ వారికి అభినందనలు తెలిపిన తరువాత కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం కావేరీ జలాల పంపకాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 

దానిపై కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే స్పందిస్తూ “రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వానికి చెందిన వ్యక్తి కాదు. ఒక సామాన్య పౌరుడిగానే అయన మాకు ఈ విజ్ఞప్తి చేసినట్లు నేను భావిస్తాను. కనుక నేను అయన విజ్ఞప్తిని స్వీకరించలేను. అయితే నేనూ ఒక సామాన్య పౌరుడిగా అయనకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో పర్యటించి అడుగంటిపోయిన రిజర్వాయర్లను, నీళ్ళు లేక ఎండిపోతున్న పంటలను ఒకసారి చూసిన తరువాత మాట్లాడాలని కోరుతున్నాను. ఇక్కడి పరిస్థితులను స్వయంగా చూసి ఉంటే ఆయన ఈవిధంగా కోరేవారుకారని నేను భావిస్తున్నాను,” అని కుమారస్వామి అన్నారు. అంటే కర్ణాటకలో ప్రభుత్వం మారినప్పటికీ కావేరీ వివాదంలో తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని అయన తేల్చి చెప్పినట్లే.

కావేరీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక, తమిళనాడు చిరకాలంగా గొడవపడుతున్నాయి. ఈ అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నది కావడంతో రెండు రాష్ట్రాలలో రాజకీయపార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం తమ రాష్ట్రాలకు అనుకూలంగా వాదిస్తున్నాయి...వ్యవహరిస్తున్నాయి. ఈ సంగతి రజనీకాంత్ కు తెలియదనుకోలేము. కానీ అయన ఈ సమస్య గురించి మాట్లాడి దానితో ‘లాక్' అయిపోయారు. 

ఇక నుంచి తమిళమీడియా, ముఖ్యంగా అయన రాజకీయ ప్రవేశాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న పార్టీలు ‘దీనిపై మీ వైఖరి ఏమిటి?’ అని నిలదీయకుండా ఉండవు. వాటికి సమాధానం చెప్పలేక అయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసిరావచ్చు. దానిపై పోరాడుతానంటే కన్నడ ప్రజలకు ఆగ్రహం కలుగుతుంది. సామరస్యంగా పోదామంటే తమిళప్రజలకు కోపం వస్తుంది. తమిళనాట రాజకీయాలలో రజనీకాంత్ కాస్త నిలద్రొక్కుకొన్న తరువాత సున్నితమైన ఈ సమస్యపై స్పందించి ఉంటే బాగుండేది. కానీ ఇంకా పార్టీ స్థాపించకముందే కావేరీ సమస్య గురించి మాట్లాడి కొత్తసమస్యను ఆహ్వానించినట్లయింది. ఆవిధంగా రజనీకాంత్ తన కాళ్ళకు తనే బంధం వేసుకొన్నట్లయింది. 


Related Post