ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం వింటే, అయన కూడా కాస్త ‘రాజకీయగాడి’లో పడుతున్నట్లే అనిపించింది. ఇపపై వరకు జరిగిన బహిరంగ సభలలో తన పార్టీ ఆశయాలు, ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ నిన్న మొదటిసారిగా వాటి గురించి మాట్లాడారు. అయన చెప్పిన విషయాలు క్లుప్తంగా:
1. తెదేపా, భాజపాలైతేనే ఏపికి న్యాయం చేస్తాయనే ఉద్దేశ్యంతో గత ఎన్నికలలో వాటికి మద్దతు ఇచ్చాను. కానీ నా అభిప్రాయం తప్పని తేలింది. కనుక వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ ఏపిలో 175 స్థానాలకు పోటీ చేస్తుంది.
2. వచ్చే ఎన్నికలలో మాపార్టీయే విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.
3. తెదేపా, భాజపాలతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. వాటినీ నా రాజకీయ ప్రత్యర్దులుగానే భావిస్తున్నాను.
4. మేము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్, గంగవరం పోర్ట్ బాధితుల బాధితుల సమస్యలను తీరుస్తాము.
5. నాకు ముఖ్యమంత్రి కావాలనే ఆశలేదు. కానీ ఆ సీటులో కూర్చోవడానికి అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాను.
6. ప్రత్యేకహోదా విషయంల చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ముగ్గురూ ఏపి ప్రజలను మోసం చేశారు. తెదేపా, వైకాపాలు భూటకపు దీక్షలు, పోరాటాలు చేస్తున్నాయి.
7. ఓటుకు నోటు కేసు కారణంగానే చంద్రబాబు నాయుడు కేంద్రానికి భయపడుతున్నారని నేను భావిస్తున్నాను.
8. హెరిటేజ్ డెయిరీ కోసం చంద్రబాబు ప్రభుత్వరంగ సంస్థ విజయా డైరీని దెబ్బ తీశారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తుంది.
ఇదివరకు బహిరంగ సభలు నిర్వహించినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా అపరిపక్వంగా మాట్లాడేవారు. అయన ప్రసంగంలో చరిత్ర పాఠాలు, కవిత్వం, సినిమాటిక్ ఆవేశం వగైరా కనిపించేవి తప్ప ‘విషయం’ ఉండేది కాదు. అయన ప్రసంగం పూర్తి అయిన తరువాత ఆయన దేనిగురించి మాట్లాడారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా తన పార్టీ ఆశయాలు, విధివిధానాలు, ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం గురించి ఏమీ చెప్పకపోవడంతో బహిరంగసభ కోసం చేసిన శ్రమ, అభిమానుల హడావుడీ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా పోయేది.
కానీ నిన్న శ్రీకాకుళంలో జరిగినసభలో ‘తమ పార్టీ వచ్చే ఎన్నికలలో ఏపిలో 175 స్థానాలకు పోటీ చేస్తుందని, తమ పార్టీ లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడం’ అని పవన్ కళ్యాణ్ చెప్పడం...ముఖ్యంగా ‘నేను ముఖ్యమంత్రినైతే...’ అనే మాటలు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. వారిని ఆ దిశలో ఆలోచింపజేసి, అందుకు సిద్ధమయ్యేలా చేస్తుంది కనుక జనసేన రాజకీయంగా బలపడేందుకు ఉపయోగపడవచ్చు.