కర్ణాటక గవర్నర్ ఆరాటం దేనికో?

May 17, 2018


img

కర్నాటక గవర్నర్ వజుభాయ్ వాలా గురించి ఇంతకాలం ఎవరూ పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు అయన యావత్ దేశప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు..తన వివాదాస్పద నిర్ణయాలతో! కర్ణాటక ఎన్నికలలో 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని అయన సమర్ధించుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 112 ఎమ్మెల్యేలు అవసరంకాగా 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న భాజపాను మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు ఏరి? లేకుంటే వారిని ఎక్కడ నుంచి తెస్తారు?అని ప్రశ్నించకుండా ఎడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి గవర్నర్ వజుభాయ్ వాలా విమర్శలపాలవుతున్నారు. 

ఇప్పుడు అంతకంటే వివాదాస్పదమైన మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే దొరికినా చాలని ఆశగా ఎదురుచూస్తున్న భాజపాకు అడగకుండానే ఒక ఎమ్మెల్యేను అయన ప్రసాదించారు. గవర్నర్ కున్న విచాక్షణాధికారాలను ఉపయోగించుకొని వినిశ్ నెరో అనే ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను శాసనసభకు నామినేట్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఎమ్మెల్యే భాజపా కోసమే సృష్టించబడ్డాడని వేరే చెప్పనవసరం లేదు. దీంతో భాజపా బలం 105కు పెరిగింది. కర్ణాటక గవర్నర్ తీరు చూస్తుంటే ఆయనకే కనుక అధికారం ఉండిఉంటే భాజపాకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను నామినేట్ చేసి ఆదుకొని ఉండేవారని రాజకీయ విశ్లేషకులు జోక్ చేస్తున్నారు. ఎడ్యూరప్ప శాసనసభలో బలం నిరూపించుకొన్న తరువాత గవర్నర్ ఎమ్మెల్యేని నామినేట్ చేసి ఉండి ఉంటే ఎవరూ ఆక్షేపించి ఉండేవారుకాదు. కానీ ఇంకా బలపరీక్ష జరుగక ముందే ఎమ్మెల్యేను నామినేట్ చేయడంతో భాజపాను ఒడ్డున పడేసేందుకు గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగంచేశారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.   

ఇప్పటికే ఎడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు గవర్నర్ నిర్ణయంపై మరో పిటిషన్ వేసింది. భాజపాకు సహాయపడేందుకే గవర్నర్ ఎమ్మెల్యేను నామినేట్ చేశారని, బలపరీక్ష పూర్తయ్యేవరకు ఆ ఎమ్మెల్యే నియామకంపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. 


Related Post