ఇప్పుడు ఫ్రంట్ పరిస్థితి ఏమిటి? రేవంత్ రెడ్డి

May 16, 2018


img

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పుకొన్న కెసిఆర్ ఇప్పుడు ఏమి చెపుతారు? జెడిఎస్ కు మద్దతు ఇచ్చిన అయన ఇప్పుడు ఏ పార్టీని ఫెడరల్ ఫ్రంట్ లో చేర్చుకొంటారు? ఇప్పుడు కర్ణాటకలో జరిగిందే రేపు దేశంలో మరోచోట కూడా జరుగుతుంది. కనుక కెసిఆర్ ఎటువైపు నిలుస్తారో ఇప్పుడే తేల్చుకొంటే మంచిది,” అని అన్నారు. 

రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. “ఒకప్పటి భాజపాకు ఇప్పటి భాజపాకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు అద్వానీ, వాజపేయి వంటి గొప్పనేతలు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారు. ఆనాడు ప్రధానిగా ఉన్న వాజపేయికి తన ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో పడిపోతుందని తెలిసినపుడు ఆయన తలుచుకొంటే ఇతర పార్టీల ఎంపిలను ఆకర్షించి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగి ఉండేవారు. కానీ నైతిక విలువలకు కట్టుబడిన ఆయన అటువంటి నీచ రాజకీయాలు చేయడానికి ఇష్టపడక అధికారాన్నే వదులుకున్నారు. కానీ ఇప్పుడు మోడీ, అమిత్ షాలకు అధికార యావే తప్ప నైతిక విలువలు, రాజ్యాంగం పట్ల నమ్మకం, గౌరవం రెండూ లేవు. అధికారం కోసం అడ్డుదారులలో ప్రయాణించడానికి ఇద్దరూ వెనుకాడటం లేదు. 

ఇదివరకు గోవా, మిజోరాం తదితర రాష్ట్రాలలో భాజపా ఏవిధంగా అనైతికంగా వ్యవహరించి అధికారం చేజిక్కించుకొందో, ఇప్పుడు కర్ణాటకలో కూడా అదేవిధంగా చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడవలసిన ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ దానిని తుంగలోతొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. 

కాంగ్రెస్, జెడిఎస్ లకు ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ, గవర్నర్ వారిని ఆహ్వానించకుండా కాలక్షేపం చేస్తూ ఎమ్మెల్యేల కొనుగోళ్ళకు భాజపాకు అవకాశం కల్పించడం చాలా దారుణం. కనుక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ గవర్నర్ వ్యవస్థ కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చ జరుపవలసిన అవసరం ఉంది,” అని రేవంత్ రెడ్డి అన్నారు. 


Related Post