ఇలాచేస్తే రైతుబంధు సద్వినియోగం

May 15, 2018


img

రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతుబంధు పధకం క్రింద చెక్కుల పంపిణీ అవుతున్నాయి. ఈ పధకం ద్వారా రాష్ట్రంలో 58,33,000 మంది రైతులు లబ్దిపొందనున్నారు. వారికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ 5,730.80 కోట్లు నిధులు విడుదల చేసింది. మళ్ళీ నవంబర్ నెలలో జరుగబోయే రెండవ విడత పంపిణీ కోసం ప్రభుత్వం మరో రూ 5,730.80 కోట్లు నిధులు విడుదల చేయనుంది. అంటే ఒక ఏడాదిలోనే రాష్ట్రంలో రైతన్నలు రూ.11,460 కోట్లు అందుకోబోతున్నారన్న మాట! ఇది చాలా పెద్దమొత్తమే. కానీ విడివిడిగా ఒక్కో రైతుకు అందే సొమ్మును చూస్తే చాలా తక్కువే ఉంటుంది. పంటపెట్టుబడి కోసమే దానిని అందించినప్పటికీ, నిత్యం ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న రైతులు దానిని అందుకే ఉపయోగిస్తారనే నమ్మకం లేదు. ఆ వచ్చిన డబ్బు ఎప్పుడు ఖర్చైపోతుందో కూడా తెలియదు. కనుక ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం (‘పంటకు పెట్టుబడి’) నెరవేరకపోవచ్చు. 

వరంగల్ అర్బన్ జిల్లా, వేలైర్ మండలంలో పీచర గ్రామంలో 10 మంది యువరైతులు కలిసి రైతుల సంక్షేమం కోసం ఒక మంచి ఆలోచన చేశారు. వారందరూ కలిసి రెండేళ్ళ క్రితం ‘స్వకృషి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (ఎఫ్.పి.ఓ.)’ అనే ఒక సంస్థను ఏర్పాటుచేశారు. ఆ యువరైతులు మండలంలో గల 8 గ్రామాలలో తిరిగి రైతులందరితో మాట్లాడి ఎఫ్.పి.ఓ.లో సభ్యులుగా చేర్చారు. వారందరూ కలిసి రూ.10 లక్షలు మూలధనం కూడబెట్టగలిగారు. అది చూసి నాబార్డు సంస్థ కూడా వారికి ఆర్ధికసాయం అందించింది. దాంతో వారు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు వగైరాలన్నీ కొనుగోలుచేసుకోగలుగుతున్నారు. 

ఇప్పుడు రైతుబంధు పధకం ద్వారా తమ 8 గ్రామాలలో రైతులకు అందిన పంటపెట్టుబడి సొమ్మును కూడా ఎఫ్.పి.ఓ.మూలధనంలో జమా చేయించేందుకు ఆ యువరైతులు కృషి చేస్తున్నారు. 

మక్తల్ మండలంలో కటిరేవపల్లి గ్రామంలో రైతుబంధు పధకం క్రింద రైతులందరికీ కలిపి మొత్తం రూ.53 లక్షలు అందాయి. వారు కూడా ఆ డబ్బును ఖర్చు చేసేయకుండా, ఈవిధంగా ఎఫ్.పి.ఓ. సంస్థను ఏర్పాటుచేసుకోని జమా చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులందరూ మండలాలవారీగా ఇటువంటి సంస్థలను ఏర్పాటుచేసుకొని, ప్రభుత్వం అందిస్తున్న పంటపెట్టుబడి సొమ్మును వాటిలో జమా చేసుకొన్నట్లయితే అది రైతులకు శాశ్వితమైన ఆర్ధికవనరుగా నిలుస్తుందని ఆ యువరైతులు చెపుతున్నారు. కనుక రాష్ట్రంలో యువరైతులు అందరూ అరుదుగా లభించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమతమ ప్రాంతాలలో ఒక శాశ్విత ఆర్దికవనరును ఏర్పాటుచేసుకోవాలని ఆ యువరైతులు సూచిస్తున్నారు.                       

ఎఫ్.పి.ఓ. సంస్థను ఏర్పాటుచేసుకోవడానికి అవసరమైన సహాయసహకారం సలహాలు, సూచనలు అందించడానికి తామందరం  సిద్దంగా ఉన్నామని, ఈవిషయంలో ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా తమను 81060 83317 ఫోన్, వాట్స్ అప్ అప్ ద్వారా సంప్రదించవచ్చని వారు తెలియజేశారు.


(ఫోటో, వీడియో: మన ఘణపూర్ సౌజన్యంతో) 


Related Post