టిజెఎస్ తో పొత్తులు..సాధ్యమేనా?

May 14, 2018


img

సిపిఎం నేతృత్వంలో రాష్ట్రంలో గల 28 పార్టీలు కలిసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) కూటమిని ఏర్పాటు చేసుకోగా, ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన కొత్తగా తెలంగాణా జనసమితి (టిజెఎస్) పార్టీ ఏర్పడింది. టిజెఎస్ తో ఎన్నికల పొత్తులకు చర్చలు జరుగుతున్నాయని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాకు తెలిపారు. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు తమ కూటమి పోటీ చేయబోతున్నట్లు తమ్మినేని చెప్పారు. టిజెఎస్ కూడా అదే లక్ష్యంతో స్థాపించబడింది కనుక అది తమతో కలిసివస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. తమ కూటమి కాంగ్రెస్, భాజపాలకు సమానదూరం పాటిస్తుందని చెప్పారు. ఒకవేళ టిజెఎస్ తమతో కలిసివస్తే సీట్ల సర్దుబాట్ల గురించి చర్చిస్తామని లేకుంటే 119 స్థానాలకు బిఎల్ఎఫ్ అభ్యర్ధులను నిలబెడతామని తమ్మినేని చెప్పారు.

కొన్ని రోజుల క్రితం టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీ అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోబోదని స్పష్టం చేశారు. కానీ టిజెఎస్, బిఎల్ఎఫ్ రెంటికీ కాంగ్రెస్, తెరాసలను ఎదుర్కొని నిలబడగల బలమైన అభ్యర్ధులు లేరు. అలాగే 119 స్థానాలకు పోటీ చేసేందుకు తగినంతమంది అభ్యర్ధులున్నట్లు కనబడటం లేదు. కనుక అవి పొత్తులు పెట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 

టిజెఎస్-బిఎల్ఎఫ్ పొత్తులు పెట్టుకొన్నట్లయితే కనీసం కొన్ని స్థానాలైన గెలుచుకొనే అవకాశం ఉంటుంది లేకుంటే ఓట్లు చీలిపోయి అవి రెండూ నష్టపోవడమే కాకుండా అధికార తెరాసకే మేలు కలుగవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చెందుతోంది. టిజెఎస్ తమతో పొత్తులు పెట్టుకోవాలని కోరుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే, ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ఏజంటుగా పని చేస్తున్నారనే తెరాస ఆరోపణలను దృవీకరించినట్లవుతుంది. కనుక కాంగ్రెస్ తో పోత్తులకు అంగీకరించకపోవచ్చు. కానీ టిజెఎస్ ఒంటరిగా బలమైన కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులను డ్డీకొనలేదు కనుక బిఎల్ఎఫ్ తో పొత్తులకు సిద్దపడవచ్చు. త్వరలోనే టిజెఎస్-బిఎల్ఎఫ్ పొత్తులపై స్పష్టత రావచ్చు. 



Related Post