కెసిఆర్ కి కూడా జెడిఎస్ హ్యాండ్?

May 14, 2018


img

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలోనే వెలువడబోతున్నాయి. సరిగ్గా ఆ ఎన్నికలకు ముందే సిఎం కెసిఆర్ బెంగళూరు వెళ్ళి ఆ పార్టీ అధినేతలు దేవగౌడ, అయన కుమారుడు కుమారస్వామిలతో భేటీ అయ్యారు. వారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత కెసిఆర్ జెడిఎస్ కు మద్దతు ప్రకటించారు. తద్వారా ఫెడరల్ ఫ్రంట్ లో జెడిఎస్ భాగస్వామి కాబోతోందనే సంకేతం ఇచ్చినట్లయింది. 

కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నారు కనుక జెడిఎస్ కూడా ఆ రెండు పార్టీలకు దూరంగా ఉంటుందని ఆశించడం సహజం. “ప్రభుత్వ ఏర్పాటుకు మాకు తగినన్ని సీట్లు రాకపోతే ప్రతిపక్ష బెంచీలో కూర్చొంటామే తప్ప ఆ రెండు పార్టీలకు మద్దతు ఈయబోము,” అని కుమారస్వామి చేసిన ప్రకటన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలకు అనుగుణంగానే ఉంది. కానీ రేపు వెలువడబోయే ఫలితాలలో కాంగ్రెస్, భాజపాలలో దేనికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవచ్చునని సర్వేలు జోస్యం చెప్పడంతో, ఇప్పుడు జెడిఎస్ మద్దతు లేకుండా కర్ణాటకలో కాంగ్రెస్, భాజపాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. 

పోలింగ్ ముగిసిన వెంటనే కుమారస్వామి సింగపూర్ వెళ్ళిపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. ఆరోగ్యపరీక్షలు చేయించుకోనేందుకే అయన సింగపూర్ వెళ్ళారని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ, కాంగ్రెస్, భాజపా మద్యవర్తులతో రహస్యంగా బేరాలు ఆడుకొనేందుకే అక్కడకు వెళ్ళారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ కాంగ్రెస్, భాజపాలలో ఏదో ఒక పార్టీతో చేతులు కలిపి ఆ ప్రభుత్వంలో జెడిఎస్ భాగస్వామి అయితే, దేవగౌడ, కుమారస్వామి ఇద్దరూ కెసిఆర్, నటుడు ప్రకాష్ రాజ్ లకు హ్యాండ్ ఇచ్చినట్లే భావించవచ్చు. ఒకవేళ కుమారస్వామి భాజపాకు మద్దతు ఇస్తే వారి నమ్మకాన్ని కూడా వమ్ము చేసినట్లవుతుంది. అంతే కాదు.. కెసిఆర్ విశ్వనీయతను ప్రశ్నార్ధకంగా మార్చినట్లవుతుంది. ‘భాజపాకు రాజకీయ లబ్ది చేకూర్చేందుకే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని ఆ ప్రయత్నంలోనే దేవగౌడని కలిసారనే కాంగ్రెస్ నేతల ఆరోపణలకు బలం చేకూరుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత జరుగబోయే రాజకీయ పరిణామాలు కెసిఆర్, ఫెడరల్ ఫ్రంట్ విస్వసనీయతకు కూడా పరీక్షగా మారడం చాలా విచిత్రమే కదా! మరికొన్ని గంటలలోనే ఈ సస్పెన్స్ వీడబోతోంది కనుక అంతవరకు వేచి చూడక తప్పదు.


Related Post