కాంగ్రెస్ కు ఒక్కసీటుకూడా రాదు: తెరాస

May 14, 2018


img

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం దక్కించుకోవడం ఖాయమని అంతవరకు గెడ్డం గీయనని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అయనతో సహా కాంగ్రెస్ నేతలందరూ బల్లగుద్ది వాదిస్తున్నారు. 

మరోపక్క తాము కనీసం 100 సీట్లు సాధించుకోవడం ఖాయమని తెరాస నేతలు వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, తెరాసలలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందో ఇప్పుడే ఊహించడం తొందరపాటే అవుతుంది కానీ పోటీ ప్రధానంగా ఆ రెండు పార్టీల మద్యే ఉండబోతోందని అర్ధమవుతోంది. ఈలోగా రెండు పార్టీల నేతలు తమతమ పార్టీలకు అనుకూలంగా తమ వాదనలు వినిపిస్తూనే ఉంటారు. 

మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణా భవన్ లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరూ డిపాజిట్లు కోల్పోవడం తధ్యం. ‘ఉత్తమ్ బాబా నలబై గ్యాంగ్’ చేస్తున్న బస్సు యాత్రలలో వారు మాట్లాడుతున్న మాటలు విని ప్రజలందరూ నవ్వుకొంటున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశ్యించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న చవుకబారు విమర్శలు, ఆరోపణలలో ప్రభుత్వంపై వారికున్న ఈర్ష్యా, ద్వేషం, ఉక్రోషం కనిపిస్తున్నాయి తప్ప వాస్తవాలు లేవు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం..’ అని మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు, సిఎం పదవి కోసం అప్పుడే తమలో తాము కీచులాడుకొంటున్నారు. వారికి ఎంతసేపు పదవులు, అధికారం గురించి ఆలోచనలే తప్ప మరొకటి ఉండదు. వారి కీచులాటలు చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.” 

“మంత్రి కేటిఆర్ విసిరిన సవాలుకు ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేకపోయారు. సవాళ్ళు విసరి పారిపోవడం ఉత్తమ్ కుమారుడికి అలవాటే. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలకు అప్పగిస్తే, రాష్ట్రాన్ని పాతబస్సు అమ్ముకొన్నట్లుగా అమ్మేసుకొంటారనే భయంతోనే 2014 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని పక్కను పెట్టి తెరాసకు అధికారం అప్పగించారు. వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ అదే జరుగబోతోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదు. కనుక రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు,” అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికలలో తెరాసకు 106-108 సీట్లు రావచ్చునని సిఎం కెసిఆర్ చెపుతున్నారు. ఆ తరువాత మంత్రి కేటిఆర్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసురుతూ తమ పార్టీ కనీసం 100 సీట్లు గెలుచుకొంటుందని లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని, ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్యాసానికి సిద్దమేనా? అని సవాలు విసిరారు. ఆ సవాలును ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజకీయ సన్యాసాల విషయం పక్కనపెట్టి చూస్తే, కెసిఆర్ 106-108 సీట్లు వస్తాయని చెపితే, కేటిఆర్ 100 సీట్లు తప్పక సాధిస్తామని చెప్పారు. అంటే అక్కడే 6-8 సీట్లు తగ్గడం గమనించవచ్చు. అంటే మొత్తం 119 సీట్లలో 19 సీట్లు వేరే పార్టీలు (?) గెలుచుకోబోతున్నాయనే కదా దానర్ధం! కనుక కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పడం సరికాదనే చెప్పవచ్చు.


Related Post