ఉత్తమ్ ప్రశ్నకు కేటిఆర్ కౌంటర్

May 14, 2018


img

తెలంగాణా రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతుబంధు పధకం గురించి తెరాస సర్కార్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో స్థానిక పత్రికలలో కెసిఆర్ ఫోటోతో ఫుల్-పేజ్ ప్రకటనలు ఇవ్వడాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. “తెలంగాణాలో అమలుచేస్తున్న ఆ పధకం గురించి వందల కోట్ల ప్రజాధనం వృధా చేసి ఇతర రాష్ట్రాల పత్రికలలో ఫుల్-పేజ్ ప్రకటనలు ఇవ్వవలసిన అవసరం ఏమిటి? రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి, ఆర్ధిక సమస్యలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి తెరాస సర్కార్ పైసలు ఉండవు. కానీ ఎక్కడో ఉన్న యూపి, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో ఫుల్-పేజ్ ప్రకటనలు ఇవ్వడానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తారు. అసలు తెలంగాణాలో రైతుబంధు పధకానికి ఇతర రాష్ట్రాలకు సంబంధం ఏమిటి? మీ స్వంత ప్రచారం కోసం ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. 

 అయన ప్రశ్నలకు ఐటి మంత్రి కేటిఆర్ సమాధానం ఇచ్చారు. రాజన్న సిరిసిల్లజిల్లాలో కోనరావు పేట, రుద్రంగి, తంగళ్లపల్లి మండల కేంద్రాలలో ఆదివారం రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటిఆర్ రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒకప్పుడు రామరాజ్యంలో కూడా రైతులు ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వమే రైతులకు ఎకరాకు 4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8,000 అందిస్తోంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మా ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి అన్ని రాష్ట్రాలకు తెలియజేస్తే తప్పేమిటి? ఈ రైతుబంధు పధకం గురించి ఇతర రాష్ట్రాల పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఈ పధకం స్పూర్తితో ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా దీనిని అమలుచేస్తాయనే ఆలోచనతోనే సిఎం కెసిఆర్ పత్రికా ప్రకటనలు చేయించారు. కానీ వాటిని చూసి ఆయా రాష్ట్రాలలో రైతులు తమ ప్రభుత్వాలను ఎక్కడ నిలదీస్తారో అని కాంగ్రెస్, భాజపా నేతలకు భయం పుట్టుకొంది. అందుకే దీనిపై కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారు,” అని అన్నారు.

మంత్రి కేటిఆర్ ఈ దుబారా ఖర్చును బాగానే సమర్ధించుకున్నారు కానీ ఈ ప్రచారం దేనికో కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నారు కనుక అందుకు ముందస్తు సన్నాహాలలో భాగంగానే దేశప్రజలకు తనను తాను పరిచయం చేసుకోవడానికి కెసిఆర్ ఈవిధంగా ప్రజాధనంతో స్వంత ప్రచారం చేసుకొంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా అనేక రకాల సంక్షేమ పధకాలు అమలవుతుంటాయి. వాటిని తెలంగాణాలో అమలుచేయాలని ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు ఏవిధంగా కోరలేవో అలాగే తెలంగాణాలో అమలవుతున్న రైతుబంధు పధకాన్ని ఇతర రాష్ట్రాలలో అమలుచేయాలని కెసిఆర్ కూడా కోరలేరు. అది నిర్ణయించుకోవలసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే. కనుక తన స్వంత ప్రచారం కోసమే ప్రజాధనంతో ఇతర రాష్ట్రాలలో పత్రికా ప్రకటనలు ఇచ్చుకొంటున్నారని ఇది తగదని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన. దీనికి కేటిఆర్ ఏమి సమాధానం చెపుతారో చూద్దాం.


Related Post