ఏపిలో ఉపఎన్నికలు వస్తాయా?

May 12, 2018


img

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నిన్న ఉండవల్లిలో పార్టీనేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు. “జూన్ 2లోగా వైకాపా ఎంపిల రాజీనామాలు ఆమోదింపబడితే ఉపఎన్నికలు రావడం తధ్యం. వైకాపా-భాజపాలు కుమ్మక్కు అయ్యాయి కనుక ఆ రెండు పార్టీలు మనల్ని ఊహించనివిధంగా దెబ్బ తీయడానికి ప్రయత్నించవచ్చు. అవి మనకు ఏదో ఒక పెద్ద సవాలు విసిరే అవకాశం ఉంది. కనుక ఏ దిక్కు నుంచి మనపై అవి దాడికి దిగినా వాటిని మనం ఎదుర్కొని తిప్పికొట్టడానికి అందరూ అప్రమత్తంగా ఉండాలి,” అని హెచ్చరించారు. రెండు నెలల క్రితం భాయ్ భాయ్ అనుకొంటూ తిరిగిన తెదేపా-భాజపాలు ఇప్పుడు ఒకదానిని మరొకటి రాజకీయంగా దెబ్బ తీసుకొనే ప్రయత్నాలు చేస్తుండటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా!  

ఒకవేళ ఏపిలో 5 ఎంపి సీట్లకు ఎన్నికలు వస్తే, సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగబోయే ఆ ఉపఎన్నికలు రెండు పార్టీలకు సెమీ ఫైనల్స్ వంటివే కనుక ఆ 5 సీట్లను దక్కించుకోవడం కోసం తెదేపా, వైకాపాల మద్య భీకరయుద్దమే జరుగవచ్చు. ఒకవేళ ఉపఎన్నికలు జరిగినట్లయితే, వైకాపా-భాజపాల బంధాన్ని ఏపి ప్రజలు ఆమోదిస్తారా లేదా? ముఖ్యంగా తెదేపా, భాజపాల గురించి ఏపి ప్రజలు ఏమనుకొంటున్నారనే సంగతి కూడా తేలిపోతుంది. కనుక ఈ ఉపఎన్నికలు జరిగితే అవి మూడు పార్టీలకు అగ్నిపరీక్షగా నిలుస్తాయి. కనుక వైకాపా ఎంపిల రాజీనామాలు ఆమోదించి ఉపఎన్నికలకు వెళ్ళాలో వద్దో మోడీ సర్కార్ బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది.


Related Post