రాజీనామా డ్రామాలు..ఎవరి కోసం?

May 12, 2018


img

ఈరోజుల్లో ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడం కూడా డ్రామాగా మారిపోయింది. రాజీనామాలు చేశామని చెపుతుంటారు కానీ వారి రాజీనామా లేఖలు ఎన్ని ఏళ్ళయినా ఆమోదింపబడవు. కారణాలు అందరికీ తెలుసు. తెరాస సర్కార్ లో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నేటికీ తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అలాగే తెరాసలో చేరిన కాంగ్రెస్, తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు నేటికీ వారిపాత పార్టీల ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఇది ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. ఎంపిలది కూడా అదే పద్ధతి. అందుకు ఉదాహరణగా నల్గొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిని చెప్పుకోవచ్చు. అయన తెలంగాణా రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి చేపట్టారు. కానీ నేటికీ కాంగ్రెస్ ఎంపిగానే కొనసాగుతున్నారు.

తెదేపాకు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఆ లేఖను పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్ళారు. నేటికీ ఆ లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరుకోలేదు. కారణాలు అందరికీ తెలుసు. కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తెదేపా ఎమ్మెల్యేగానే ఉన్నట్లు లెక్క.  

అదేవిధంగా ఏపిలో 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి ఫిరాయించారు. వారందరూ నేటికీ వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. వారిలో స్వర్గీయ భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ బాబు క్యాబినెట్ లో మంత్రిగా చేస్తున్నారు.  

ఇక ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వందుకు నిరసనగా ఐదుగురు వైకాపా ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఏప్రిల్ 6న పార్లమెంటు సమావేశాలు ముగియగానే వారు తమ రాజీనామాపత్రాలను స్పీకర్ కు అందజేశారు. కానీ నేటికీ అవి ఆమోదింపబడలేదు. ఏపికి ప్రత్యేకహోదా సాధించేందుకు తమ ఎంపిలు అందరూ త్యాగాలు (రాజీనామాలు) చేశారని, తెదేపా ఎంపిలు కూడా రాజీనామాలు చేసినట్లయితే ప్రత్యేకహోదా వస్తుందని గట్టిగా వాదించిన జగన్మోహన్ రెడ్డి, ఇంతవరకు తన ఎంపిల రాజీనామా లేఖలను అందింపజేసుకోలేదు. కనీసం అటువంటి ఆలోచన కూడా చేయడం లేదు. భాజపాకు వైకాపా దగ్గరవడమే అందుకు కారణం. వారి రాజీనామాలు ఆమోదింపబడలేదు కనుక నేటికీ వారు ఎంపిలుగానే కొనసాగుతున్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, తన రాజకీయ ప్రత్యర్ధి తెదేపాపై రాజకీయంగా పైచెయ్యి సాధించడానికే వైకాపా రాజీనామాల డ్రామా ఆడినట్లు స్పష్టం అవుతోంది.

కనుక ఈరోజుల్లో ప్రజాప్రతినిధుల రాజీనామాలు చేసినా వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకొంటూ దాని గౌరవాన్ని కాపాడుతామని ప్రమాణాలు చేసిన ప్రజాప్రతినిధులెవరికీ దానిపై గౌరవం లేదని స్పష్టమవుతోంది.


Related Post