కర్ణాటకలో పోలింగ్ షురూ!

May 12, 2018


img

కర్ణాటక శాసనసభకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాజరాజేశ్వరి నగర్, జయనగర రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన 222 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. 222 స్థానాలకు 2,984 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అంటే ఒక్కో సీటుకు సగటున 10 మంది పోటీ పడుతున్నారన్న మాట. 

రాష్ట్రంలో మొత్తం 4.96 కోట్లు మంది ఓటర్లున్నారు. వారి కోసం 58,008 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశేషమేమిటంటే వాటిలో ఏకంగా 12,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవి, మరో 534 అత్యంత సమస్యాత్మకమైనవి కావడం. కనుక వాటి వద్ద అధనంగా భద్రతాదళాలను మొహరించారు. ఈరోజు జరుగుతున్న పోలింగ్ కోసం ఒకటిన్నర లక్షల మంది పోలీసులను, మరో 50 వేలమంది కేంద్రబలగాలను మొహరించవలసి వచ్చిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, భాజపాల మద్యే ఉంది. కానీ మద్యలో దేవగౌడకు చెందిన జెడిఎస్ కూడా బలం పుంజుకోవడంతో ఫలితాలు వెలువడిన తరువాత అది నిర్ణయాత్మకశక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈసారి భాజపా కనీసం 130 సీట్లు గెలుచుకొని ఎవరి మద్దతు లేకుండానే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నమ్మకంగా చెపుతున్నారు. కానీ మళ్ళీ తామే అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెపుతున్నారు. 

కర్ణాటకలో 1985 నుంచి ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని మరుసటి ఎన్నికలలో ప్రజలు పక్కనపెడుతున్నారు. ఒకవేళ ఆ ఆనవాయితీ కొనసాగినట్లయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు. కానీ ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి చూపిస్తామని సిఎం సిద్దరామయ్య నమ్మకంగా చెపుతున్నారు. కాంగ్రెస్, భాజపా, జెడిఎస్ లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు లభిస్తాయో మరో మూడు రోజులలో అంటే మే 15వ తేదీన ఫలితాలు వెలువడినప్పుడు తెలిసిపోతుంది.


Related Post