తెరాసకు ఇంట్లో ఈగల మోత...తప్పదా?

May 11, 2018


img

తెరాస సర్కార్ పరిస్థితి ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోత అన్నట్లుంది. అది చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్రప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్రాలు ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం తెరాస గాలి తీసేస్తున్నాయి. 

రైతుబంధు పధకం గురించి తెరాస సర్కార్ ఇతర రాష్ట్రాలలో పత్రికలలో పూర్తి పేజి ప్రకటనలు ఇచ్చుకోవడాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టగా, 'పంటపెట్టుబడికని తెరాస సర్కార్ ఇస్తున్న చెక్కులు నిజానికి వచ్చే ఎన్నికలలో ఓట్ల కోసం పెడుతున్నబడి' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభివర్ణించారు. "నాలుగేళ్లలో రైతులను పట్టించుకోని కారణంగా రాష్ట్రంలో రైతాంగం ఆగ్రహంతో ఉందని ఇంటలిజన్స్ నివేదికల ద్వారా తెలుసుకొన్న సిఎం కెసిఆర్ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నందున రైతులను ప్రసన్నం చేసుకొని వారి ఓట్లు దండుకోవడానికే రూ.12,000 కోట్లు రైతులకు పంచిపెడుతున్నారని విమర్శించారు. కనుక ఇది పంటపెట్టుబడికాదని ఓట్ల కోసం తెరాస సర్కార్ పెడుతున్న పెట్టుబడి," అని చిన్నారెడ్డి అన్నారు. 

పంటపెట్టుబడి విషయంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా చేదుగా, వినడానికి చాలా అసహ్యంగా ఉన్నప్పటికీ ఆయన వాదనలో నిజం లేకపోలేదు. ఇదే పెట్టుబడిని తెరాస సర్కార్ మొదటి సంవత్సరం నుంచే ఇచ్చి ఉండి ఉంటే నేడు ఎవరూ దానినీ ఈవిధంగా వేలెత్తి చూపగలిగేవారు కాదు. నిజానికి ఇప్పుడు కంటే మూడేళ్ళ క్రితమే రైతులకు ప్రభుత్వ సాయం అవసరం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. పంటలకు నీళ్ళు లేక బోర్లకు కరెంటు లేక రైతులు నానా కష్టాలు పడేవారు. ఆ భాధలు, కష్టాలు భరించలేక అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కనుక ఈ పంటపెట్టుబడిని అప్పుడే గనుక రైతులకు  అందించి ఉండి ఉంటే అది వారికి ఎక్కువ ఉపయోగపడేది. ఆవిధంగా చేసి ఉంటే అది తెరాస సర్కార్ చిత్తశుద్ధికి అద్దం పట్టేది.

కానీ ఇప్పుడు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, సాగునీరు, మిషన్ కాకతీయ వంటి పధకాల వలన రాష్ట్రంలో రైతులకు చాలా వెసులుబాటు లభించింది. కనుక ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో రైతులకు పంటపెట్టుబడి పేరుతో డబ్బు పంచడం అంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకోవాలనే ఆలోచన కూడా ఇమిడిఉందనే భావించాల్సి ఉంటుంది. 

ఇక హుజూరాబాద్ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కళ్ళకు కనబడుతున్నాయి కనుక వాటి గురించి ప్రత్యేకంగా డప్పు కొట్టి చాటింపు వేసుకోనవసరం లేదని అన్నారు. కానీ సరిగ్గా అదేరోజున దేశావ్యాప్తంగా పలురాష్ట్రాలలో పత్రికలలో రైతుబంధు పధకం గురించి తెరాస సర్కార్ పూర్తి పేజి ప్రకటనలు ఇచ్చుకోవడం చాటింపే కదా!

సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నారు కనుక, ముందుగా తన గురించి దేశప్రజలకు పరిచయం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ ప్రకటనలు ఇచ్చి ఉండవచ్చు. అంటే ఒకవైపు రైతులకు పంట పెట్టుబడి అందిస్తూనే, దానిని తన స్వీయప్రచారం కోసం, తన పార్టీ ప్రచారం కోసం కూడా కెసిఆర్ తెలివిగా ఉపయోగించుకొంటున్నారని కాంగ్రెస్ నేతలు వాదన. వారి వాదనలను తెరాస నేతలు కాదనగలరా? కాదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.


Related Post