తెరాస నుంచి కూడా వలసలు మొదలయ్యాయా?

May 11, 2018


img

వచ్చే ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టికెట్స్ కేటాయిస్తానని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనతో తెరాసలో టికెట్ ఆశిస్తున్నవారందరికీ ‘మరోదారి’ వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారిలో సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కూడా ఒకరు. అయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తరువాత తెరాసలోకి వచ్చి 2014 ఎన్నికలలో పోటీ చేశారు. కానీ స్వల్పతేడాతో తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కోనేరు కోనప్ప చేతిలో ఓడిపోయారు. ఎన్నికలలో ఓడిపోవడం, ఆ తరువాత తన రాజకీయ ప్రత్యర్ధి కోనేరు కోనప్ప బి.ఎస్.పి.నుంచి తెరాసలోకి రావడంతో సమ్మయ్యకు తెరాస ఇమడలేక ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ సిఎం కెసిఆర్ పట్ల నమ్మకంతో సమ్మయ్య, అయన భార్య సాయిలీల (కాగజ్‌నగర్‌ మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌) ఇంతకాలం తెరాసలోనే కొనసాగారు. కానీ నాలుగేళ్ళు గడిచిపోయి మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్నా తెరాసలో ఎటువంటి గుర్తింపు, గౌరవం లభించకపోవడంతో ఆ దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తామని కెసిఆర్ చేసిన ప్రకటనతో ఇక తమకు టికెట్ లభించదని గ్రహించిన సమ్మయ్య దంపతులు, మళ్ళీ కాంగ్రెస్ గూటికే తిరిగివెళ్ళిపోవడానికి సిద్దపడుతున్నారు.

సమ్మయ్య దంపతులు అసంతృప్తితో ఉండటం గమనించిన జిల్లా కాంగ్రెస్ నేతలు మహేశ్వర్ రెడ్డి, అరవింద్ రెడ్డి తదితరులు వారితో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పించగలిగారు. కొన్ని రోజుల క్రితమే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మయ్య దంపతులతో ఫోన్ లో మాట్లాడి ఇద్దరినీ పార్టీలోకి ఆహ్వానించగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, కుమ్రుం భీమ్ జిల్లాలలో ప్రజాచైతన్యయాత్రలు నిర్వహించబోతోంది. ఆ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో సమ్మయ్య దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ తెరాస నుంచి ఇంకా అనేకమంది ఆశావహులు ఇతర పార్టీలలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇల్లలకగానే పండుగ కాదనట్లు ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే సరిపోదు. వారికి టికెట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే గోసుల శ్రీనివాస్ యాదవ్, సిడాం గణపతి, రావి శ్రీనివాస్ ముగ్గురూ వచ్చే ఎన్నికలలో సిర్పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు కావేటి సమ్మయ్య కూడా ఆ జాబితాలో చేరబోతున్నారు. కనుక మళ్ళీ అక్కడా అసంతృప్తి, అసమ్మతి తప్పదని స్పష్టం అవుతోంది.


Related Post