దటీజ్ కెసిఆర్!

May 10, 2018


img

చెప్పవలసిన విషయాన్ని మనసులకు హత్తుకొనేలా చెప్పడం, ఆ మాటలతోనే మనసులు గెలుచుకోవడం సిఎం కెసిఆర్ కే చెల్లు. నిన్న మెదక్ సభలో, నేడు హుజురాబాద్ సభలో ఇది మరోసారి నిరూపితమైంది. మెదక్ సభలో కెసిఆర్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిని సభా ముఖంగా ప్రశంసించి అయన మనసును, ప్రజల మనసులను కూడా కెసిఆర్ గెలుచుకొన్నారు. 

ఆయన చేసిన సూచనే ఇది అంటూ రాష్ట్రంలో రైతుల నీటి తీరువా బకాయిలను రద్దు చేస్తున్నానని కెసిఆర్ ప్రకటించారు. ప్రజల పట్ల అటువంటి అంకితభావం కలిగిన గొప్ప అధికారి కలిగి ఉండటం వలననే రాష్ట్రంలో శరవేగంగా       అభివృద్ధిపనులు సాగుతున్నాయని కలెక్టర్ ధర్మారెడ్డిపై కెసిఆర్ ప్రశంశల జల్లు కురిపించారు. 

సాధారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు సభలు సమావేశాలు నిర్వహిస్తే, వాటిలో పాల్గొనే అధికారులకు ఏదో సందర్భంగా చివాట్లు, అవమానాలే తప్ప ఈవిధంగా సభాముఖంగా ప్రశంశలు లభించవు. ఒకవేళ వారు నిజంగా ప్రశంసించదగ్గ గొప్ప పనులే చేసినా వాటి గురించి ఈవిధంగా సభాముఖంగా ప్రజలకు చెప్పడానికి మన నేతలు, ప్రజా ప్రతినిధులు ఇష్టపడరు. వీలైతే ఆ పనులు కూడా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడానికి వెనుకాడరు. 

ఒకవేళ ఎవరైనా అధికారి సాహసం చేసి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఇటువంటి సూచన చేస్తే, మరో ఆలోచన లేకుండా వారిని మన నేతలు అందరి ముందు ఈసడించుకొని అవమానిస్తుంటారు తప్ప ఈవిధంగా కెసిఆర్ లాగ సభాముఖంగా మెచ్చుకోరు. 

కానీ కెసిఆర్ మాత్రం ఆ అధికారి (కలెక్టర్ ధర్మారెడ్డి) చేసిన సూచన గురించి గొప్పగా చెప్పడమే కాక దానిని తక్షణమే అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. రూ.800 కోట్లు నీటి తీరువా బకాయిలను వెంటనే రద్దు చేస్తున్నానని, ఇకనుంచి భవిష్యత్ లో రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూలు చేయబోమని ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని సిఎం కెసిఆర్ సభా ముఖంగా ప్రకటించారు. అంటే కలెక్టర్ ధర్మారెడ్డి సూచనకు సిఎం కెసిఆర్ ఎంత విలువ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. అందుకే దటీజ్ కెసిఆర్ అనుకోకతప్పదు. 

ఇక ఈరోజు హుజూరాబాద్ లో జరిగిన సభలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఒక సూచన గురించి చెప్పి ‘ఆయన తనకు తమ్ముడు వంటివాడని, నా ఆత్మీయులలో ఒకరిగా భావిస్తానని కనుక అయన మాటను ఎన్నడూ కాదనలేనని’ కెసిఆర్ సభాముఖంగా చెప్పారు. కరీంనగర్ రైతులకు మేలు చేసే ఒక కార్యక్రమం కోసం రూ.500 కోట్లు మంజూరు చేయాలని ఈటల రాజేందర్ తనను కోరారని, అప్పుడు ‘నువ్వే ఆర్దికమంత్రిగా ఉన్నావు కదా..అంత డబ్బు ఎలా సర్దుబాటు చేస్తావో చెప్పు..’అన్నానని కెసిఆర్ చెప్పారు. నా ప్రియమైన తమ్ముడు జిల్లా ప్రజల మేలు కోరి అడిగితే నేను కాధనలేనని, అందుకోసం రూ.500 కోట్లు అప్పు తెచ్చయినా ఇవ్వడానికి వెనుకాడనని’ కెసిఆర్ అన్నారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై సింహంలా విరుచుకుపడే కెసిఆర్, తన సహచర మంత్రులు, అధికారులు, ఉద్యోగులపట్ల ఇంత ప్రేమానురాగాలు చూపడం చాలా గొప్ప విషయం.   

తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్స్ పధకం విజయవంతం కావడానికి ప్రభుత్వాసుపత్రులలో వైద్యులు, నిరంతర విద్యుత్ సరఫరా చేయడం కోసం విద్యుత్ ఉద్యోగులు, రెవెన్యూ రికార్డులను నిర్దేశించిన గడువులోగా ప్రక్షాళన చేసిన రెవెన్యూశాఖ ఉద్యోగులు, రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాల సిద్దం చేయడానికి వ్యవసాయశాఖ, బ్యాంక్ అధికారులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారని, వారందరూ అంతగా కష్టపడుతున్నారు కనుకనే ఇంత తక్కువ కాలంలో రాష్ట్రంలో ఇంత అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల అమలుచేయగలుగుతున్నామని సిఎం కెసిఆర్ సభాముఖంగా తన అధికారులను, ఉద్యోగులను పొగిడారు. 

తద్వారా వారందరూ తమ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభించాయని సంతోషపడతారు. ఈవిధంగా ఒక ముఖ్యమంత్రి తన క్రింద పనిచేసే మంత్రులు, ఉన్నతాధికారులు మొదలు అట్టడుగు స్థాయి ఉద్యోగి వరకు ఎవరు మంచి పని చేసినా సభాముఖంగా వారి గురించి నలుగురికి చెప్పి వారిని మెచ్చుకోవడం మనకు దేశంలో ఎక్కడా కనబడదు. మనుషుల మనసులను గెలుచుకోవడం తనకే చెల్లునని దీంతో కెసిఆర్ మరోసారి రుజువు చేశారు.             



Related Post