నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు

May 10, 2018


img

ఈ నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక నేటి సాయంత్రం 5గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. గత నెలన్నర రోజులుగా కాంగ్రెస్, భాజపా అగ్రనేతల ప్రచారం దాదాపు ప్రత్యక్ష యుద్ధంలాగే సాగింది. నిజానికి అవి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలే అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ-రాహుల్ గాంధీల మద్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్నట్లుగా ఇరువురూ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకొన్నారు. వారు ఈ ఎన్నికలను యుద్దస్థాయిలో భావించి పోరాడటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావించడం ఒక కారణమైతే, కర్ణాటకలో అధికారం నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఎలాగైనా విజయం సాధించి మళ్ళీ కర్ణాటకలో అధికారం దక్కించుకోవాలని భాజపా తాపత్రయపడటం మరో కారణమని చెప్పవచ్చు.             

కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్, భాజపాలు యుద్ధానికి తీసిపోని స్థాయిలో చేసిన ప్రచారం వలన కర్ణాటక ప్రజలపై రెండు పార్టీలు తీవ్ర ప్రభావం చూపగలిగాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, అవినీతి, అక్రమాల ఆరోపణలతో జైలుకు వెళ్ళివచ్చిన యెడ్యూరప్పను కర్ణాటక ప్రజలు ముఖ్యమంత్రిని చేయడానికి అంగీకరించకపోవచ్చు. కనుక అవినీతిపరులైన ఎడ్యూరప్ప, గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుల కారణంగానే ప్రజలు భాజపాను తిరస్కరించే అవకాశం ఉంది. కానీ వారు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా శక్తిమంతులైనవారు కనుక వారే ‘ఏదో ఒకటి చేసి’ భాజపాను గెలిపించినా ఆశ్చర్యం లేదు. కనుక భాజపాకు బలమూ, బలహీనత రెండూ కూడా వారేనని చెప్పవచ్చు. కర్ణాటక ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారో మరొక 5 రోజులలోనే వెలువడితే తేలిపోతుంది. మే 12న పోలింగ్ జరుగుతుంది. మే 15వ తేదీన ఫలితాలు వెలువడబోతున్నాయి.


Related Post