నేడు తెలంగాణా రైతన్నలకు పండుగ

May 10, 2018


img

నేడు తెలంగాణా రైతన్నలకు పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58,33,000 మంది రైతులకు గురువారం రైతుబంధు చెక్కులు అందుకోబోతున్నారు. దీని కోసం మొత్తం రూ. 5730.80 కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం అధనంగా మరో రూ.50 కోట్లు కలిపి రూ. 5,785 కోట్లు బ్యాంకులలో సిద్దంగా ఉంచింది. 

ఈరోజు ఉదయం 11 గంటలకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్ లో జరుగబోయే బహిరంగసభలో సిఎం కెసిఆర్ రైతుబంధు (పంట పెట్టుబడి) చెక్కులు, కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులు, పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం మోడ్లావుతుంది. 

ఈ కార్యక్రమంలో ఎక్కడా లోపాలు, సమస్యలు ఎదురవకుండా ఉండేందుకు సంబంధిత శాఖల అధికారులతో సిఎం కెసిఆర్ రెండు మూడుసార్లు సమీక్షా సమావేశాలు జరిపి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు కూడా ప్రతీ విషయాన్ని ఒకటికి రెండుసార్లు నిశితంగా పరిశీలించుకొని వీటి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీ ఊరులో గ్రామసభలు నిర్వహించి వాటిలో ఈ చెక్కులను, కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తారు.


వ్యవసాయ శాఖ అధ్వర్యంలో జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసేందుకు నాలుగైదు జిల్లాలకు ఒకరు చొప్పున వ్యవసాయ, మార్కెటింగ్, సహకార తదితర శాఖల ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించబడ్డాయి. గ్రామసభలలో చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి లోపాలు, సమస్యలు ఎదురైనా వారు ఆయా జిల్లా కలెక్టర్ల సాయంతో అప్పటికప్పుడు వాటిని సవరించి లబ్దిదారులకు అందజేస్తారు. నేటి నుంచి మే 17వరకు వారు ఈ పనులను మాత్రమే చూస్తారు.    

అన్ని ఏర్పాట్లు చేసి, బ్యాంకులలో సరిపడిన దాని కంటే ఎక్కువే నగదు నిలువలు ఉంచి, ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటుంనందున చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు. మరికొద్ది సేపటిలో రాష్ట్రమంతటా చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ మొదలవబోతోంది కనుక రైతులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రమంతటా పండగ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్రంలో అందరూ ఎప్పడూ ఇలాగే సంతోషంగా ఉండాలని, మళ్ళీ వ్యవసాయం పండుగలా మారాలని ఆశిద్దాం.


Related Post