ఆ ప్రకటనతో తెరాస తలుపులు మూసేసినట్లే

May 10, 2018


img

 ‘బంగారి తెలంగాణా సాధన కోసం రాజకీయశక్తుల పునరేకీకరణ’ పేరిట రెండేళ్ళ క్రితం కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత కూడా కొంతకాలం ప్రతిపక్షపార్టీలలోనుంచి కొంతమంది సీనియర్ నేతల ఫిరాయింపులు కొనసాగాయి. కానీ అవి కూడా మెల్లగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఇతర పార్టీలలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రమే తెరాసలో చేరుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకు బలమైన కొన్ని కారణాలున్నాయి. 

మొదటి రెండు విడతల ఫిరాయింపులతోనే తెరాస హౌస్ ఫుల్ అయిపోయింది. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశ్యం లేదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కనుక కొత్తగా చేరేవారికి టికెట్స్ లభించే అవకాశం లేదు. వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్స్ ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. కనుక ఆ ప్రకటనతో టికెట్లు ఆశించి పార్టీలో చేరాలనుకొన్నవారికి తెరాస తలుపులు మూసేసినట్లే. బహుశః అందుకే ఇతర పార్టీలలో సీనియర్ నేతలు ఎవరూ తెరాసవైపు చూడటం లేదని భావించవచ్చు. 

ఇది కాంగ్రెస్, భాజపా, ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణా జనసమితి (టిజెఎస్) పార్టీలకు కలిసి వచ్చే అంశమే. అయితే వచ్చే ఎన్నికలలో తెరాస-కాంగ్రెస్ పార్టీల మద్యే ప్రధానంగా పోటీ ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమయింది. కనుక తెరాసలోకి వెళ్ళలేకపోయిన నేతలు దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకు తాజా ఉదాహరణగా భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి, తెదేపా సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి చేరికలను చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ బలమైన అభ్యర్ధులకు కొరత ఏర్పడిన దాఖలాలు లేవు. కనుక అ పార్టీలో కొత్తగా చేరుతున్న, చేరదలచుకొన్న ఇతర పార్టీ నేతలు టికెట్ హామీ లభించిన తరువాతే చేరుతున్నట్లు భావించవచ్చు. కనుక నాగం, వంటేరులకు కూడా టికెట్ హామీ లభించినట్లే భావించాల్సి ఉంటుంది. 

కాంగ్రెస్ పార్టీ తరువాత భాజపా, వామపక్షాలు, తెలంగాణా జనసమితి పార్టీలు ప్రత్యామ్నాయలుగా కనిపిస్తున్నాయి. వాటికి బలమైన అభ్యర్ధులు లేరు కనుక వాటి ద్వారాలు ఎప్పుడూ అందరికీ తెరిచే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ దక్కనినేతలు వాటిలో దేనినో ఒక దానిని ఎంచుకొని చేరిపోక తప్పదు. అయితే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తునాయి కనుక కాంగ్రెస్ లో టికెట్ సాధించలేని నేతలు భాజపాలో చేరే అవకాశాలున్నాయి. 

‘సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు కేటాయిస్తానని’ సిఎం కెసిఆర్ ప్రకటన చేసి తెరాస తలుపులు మూసివేయడం వలననే ఈ పరిణామాలు జరుగుతున్నట్లు భావించవచ్చు. కనుక ప్రతిపక్షాలు కెసిఆర్ కు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.


Related Post