తెలంగాణాలో టిడిపి ఖాళీ అయిపోనుందా?

May 10, 2018


img

వచ్చే ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రంలో తెదేపా ఖాళీ అయిపోనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే తెదేపా ఎమ్మెల్యేలలో ఇద్దరు తప్ప రేవంత్ రెడ్డితో సహా మిగిలినవారందరూ కాంగ్రెస్, తెరాసలలో చేరిపోయారు. ఆర్.కృష్ణయ్య తెదేపా ఎమ్మెల్యే అయినప్పటికీ అయన ఏనాడూ పార్టీతో అనుబంధం కొనసాగించలేదు. తెదేపా కూడా ఆయనను ఏనాడూ పట్టించుకోలేదు. ఇక మిగిలిన ఒక్క ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక ఆ సమస్య నుంచి బయటపడటానికి ఆయన కూడా ఏదో ఒకరోజు తెరాసలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక తెదేపాను తెరాసలో విలీనం చేయాలని చెప్పి మోత్కుపల్లి నరసింహులు పార్టీ ఆగ్రహానికి గురయిన సంగతి అందరికీ తెలిసిందే. 

తాజాగా తెదేపా సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీ వారిని తోడ్కొని డిల్లీ తీసుకువెళుతున్నారు. 

కొన్ని రోజుల క్రితమే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తన పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యి, తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణను మెతక వైఖరి వీడి వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయాలని ఆదేశించారు. పార్టీ నేతలు అందరూ పార్టీ కార్యాలయానికే పరిమితమవుతున్నారని అందరూ తక్షణం ప్రజలలోకి వెళ్ళాలని చంద్రబాబు ఆదేశించారు. ఆ సమావేశం తరువాతే పార్టీలో సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుండటం గమనిస్తే, పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పిన పాఠాలు పనిచేయలేదని స్పష్టమవుతోంది. కనుక వచ్చే ఎన్నికలలోగా మిగిలిన నేతలు కూడా పార్టీలో నుంచి బయటకు జంప్ చేసేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా రాష్ట్రంలో తెదేపా పూర్తిగా లేదా దాదాపు అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు. 



Related Post