కళ్ళకు కనపించేవిధంగా అభివృద్ధి: కెసిఆర్

May 10, 2018


img

మెదక్ పట్టణ శివారులో ఔరంగాబాద్ వద్ద నిన్న జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, “దేశంలో మరే రాష్ట్రంలోను జరుగనంత వేగంగా మన రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి జరుగడం చూసి దేశంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత పాలకుల హయాంలో అభివృద్ధి అంతా కాగితాలకు, గణాంకాలకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు అభివృద్ధి మీ కళ్ళకు కనబడుతోంది. మీ జిల్లాలు, మీ ఊళ్ళకు ఎన్ని నిధులు అందుతున్నాయో మీరే చూస్తున్నారు. ఇప్పుడు ప్రతీ ఊరిలో కొత్తగా వేసిన రోడ్లు కనబడుతున్నాయి. మీ ఊరిలోనే పూడిక తీసిన చెరువులు నీళ్ళతో నిండి కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. రైతులందరికీ నిరంతర విద్యుత్ అందుతోంది. పేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు నెలనెలా పెన్షన్లు అందుతున్నాయి.” 

“ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినప్పుడు రాష్ట్రంలో భూరికార్డులను సమూలంగా ప్రక్షాళన చేశామని తెలిసి, ‘మా రాష్ట్రంలో ఆ పని ఎన్నటికీ చేయలేము. చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని’ చెప్పారు. కానీ మన రాష్ట్రంలో కేవలం 100 రోజులలోనే 99 శాతం భూరికార్డులు ప్రక్షాళన చేసి చూపించాము. రేపే రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందుకోబోతున్నారు.” 

“రాష్ట్రంలో కొత్తగా పుట్టిన శిశువులు మొదలు బాలబాలికలు, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, విద్యార్ధులు, వివిధ కులస్తులు, మతస్తులు...ఇలా సమాజంలో ప్రతీవర్గానికి చెందిన ప్రజలు ఏదో ఒక పధకం ద్వారా మేలు లేదా లబ్ది పొందుతునే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలు, ఊళ్లలో కళ్ళకు కనిపించేవిధంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. దానిని మీరే స్వయంగా చూస్తున్నారు. కనుక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని డప్పుకొట్టి చాటింపు వేసుకోనవసరం మాకు లేదు. ఇదంతా తెలంగాణా రాష్ట్రం కోసం మనం కలిసికట్టుగా పోరాడి సాధించుకొని, స్వయంపాలన చేసుకొంటునందునే సాధ్యమైంది. మాకు మీ ఆశీర్వాదం ఉంటే ఈ అభివృద్ధి నిరంతరంగా ఇలాగే సాగిపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను,” అని అన్నారు సిఎం కెసిఆర్. 


Related Post