కేటిఆర్ పై మత్తయ్య ఆరోపణలు

May 09, 2018


img

ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, ఐటి మంత్రి కేటిఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఈ కేసులో నిజానిజాలు బయటపడాలంటే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి. 2015 మే 30వ తేదీన కేసు నమోదుకు ముందు మొత్తం 300 మంది టెలిఫోన్లను తెలంగాణా ఇంటలిజన్స్ అధికారులు ట్యాప్ చేశారు. ఈ వ్యవహారంలో కేటిఆర్ హస్తం కూడా ఉంది. కనుక వారందరిపై ట్రాయ్ చట్టం ప్రకారం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలి. ఈ కేసులో ఏసిబి సేకరించిన ఆడియో, వీడియో ఆధారాలను రహస్యంగా ఉంచి కోర్టుకు సమర్పించవలసి ఉండగా, వాటిని రాజకీయ దురుదేశ్యంతోనే మీడియాకు లీక్ చేశారు. ఇది రాజకీయకుట్రలో భాగంగానే ఆపని చేశారు. ఈకేసులో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని భావిస్తున్నట్లయితే ఇంతవరకు ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఒకవేళ ఆయనకు సబంధం ఉందని భావిస్తే ఆయనపై కూడా కేసు నమోదు చేసి ఛార్జ్-షీట్ దాఖలు చేయవచ్చు కదా? కనీసం ఇప్పటికైనా ఈ కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని మత్తయ్య అన్నారు. 

మంత్రి కేటిఆర్ పై మత్తయ్య ఆరోపణలను పక్కనపెట్టి చూస్తే, పదవీ, అధికారం ఉన్న వారిని ఏమీ చేయలేక తనవంటి సామాన్యులను బలిపశువులుగా చేస్తున్నారనే ఆవేదన కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుపై కూడా కేసు నమోదు చేయాలని మత్తయ్య కోరడం ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, అయన అక్కడే కాస్త తెలివిగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఒకవేళ తెలంగాణా ఎసిబి అధికారులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసినట్లయితే, వెంటనే ఏపి ఏసిబి అధికారులు కూడా టెలీఫోన్ ట్యాపింగ్ ఫైలు దుమ్ము దులుపి అటక మీద నుంచి దించడం ఖాయం. అప్పుడు మళ్ళీ తెదేపా, తెరాసల మద్య ప్రతిష్టంభన ఏర్పడటం, కేసులు మళ్ళీ అటకెక్కడం ఖాయం. ఇక సిబిఐ విచారణకు ఆదేశించినా చివరికి అదే జరుగుతుంది. అందుకే మత్తయ్య చంద్రబాబు నాయుడును కూడా ఈ ముగ్గులోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.


Related Post