కర్ణాటక తరువాత టార్గెట్ తెలంగాణా?

May 08, 2018


img

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా రాష్ట్రంపై దృష్టిసారించనున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఈనెల 12న కర్ణాటక ఎన్నికలు జరుగుతాయి. అవి ముగియగానే 14వ తేదీన డిల్లీలో జరుగబోయే సమావేశానికి రావలసిందిగా అమిత్ షా తమను ఆహ్వానించారని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామని చెప్పారు. ఆ సమావేశంలోనే అమిత్ షా తెలంగాణా రాష్ట్ర పర్యటనషెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉందని లక్ష్మణ్ చెప్పారు. మే నెలాఖరులోగా లేదా జూన్ మొదటివారంలో అమిత్ షా రాష్ట్ర పర్యటన ఉండే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అమిత్ షా రాష్ట్ర పర్యటన ఉంటుందని చెప్పారు. తాము డిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రాగానే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ 17,18 తేదీలలో రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, అమిత్ షా పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చిస్తారని లక్ష్మణ్ తెలిపారు. 

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ తో పోల్చి చూసినా భాజపా చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఇక నానాటికీ బలపడుతున్న అధికార తెరాసను ఏవిధంగా ఓడించగలదు? అనే ప్రశ్నకు భాజపా నేతలే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ మోడీ-కెసిఆర్ మద్య రహస్య అవగాహన, స్నేహం ఉన్నట్లయితే, ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులకు అమిత్ షా ఏమైనా కృషి చేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ తెరాసతో రహస్యంగా స్నేహం కొనసాగిస్తూ, పైకి విమర్శిస్తూ, తెరాస సర్కార్ పై రాష్ట్ర భాజపా నేతలు ఎంతగా పోరాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. 

కనుక వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ముందు తెరాస తమకు మిత్రుడా శత్రువా అనే విషయం ప్రజలు కూడా నమ్మేవిధంగా తెలియజేయడం చాలా అవసరం. ఆ తరువాతే భాజపా ఎన్నికలలో పోటీ చేయడం, గెలిచి అధికారంలోకి రావడం గురించి మాట్లాడితే మంచిది. 


Related Post