ప్రధానమంత్రి పదవి చేపడతా: రాహుల్

May 08, 2018


img

కర్ణాటకలో ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, ‘వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ సాధిస్తే తాను తప్పకుండా ప్రధానమంత్రి పదవి చేపడతానని’ చెప్పారు. 

నిజానికి ఇదేమి కొత్త విషయం కాదు. గత ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ అందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. కానీ మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి మళ్ళీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని, అప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేపట్టడం ఖాయమని  కాంగ్రెస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. బహుశః ఆ నమ్మకంతోనే రాహుల్ గాంధీ ఈ మాట అని ఉండవచ్చు. కాంగ్రెస్ నేతల నమ్మకానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.  

2014 ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మోడీ ‘హవా’ వ్యాపించి ఉంది. కారణాలు అందరికీ తెలిసినవే. ఆ తరువాత మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, అనేక సంస్కరణలు, కటిన నిర్ణయాలు తీసుకొన్నప్పుడు కూడా దేశప్రజలు అందరూ వాటిని ఆమోదించారు. కానీ నోట్ల రద్దు, జి.ఎస్.టి.అమలు, నగదుకొరత, దళితులపై దాడులు, దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, మాల్యా, కొఠారీ, చోక్సీ, నీరవ్ మోడీ వంటి బడాబాబులు బ్యాంకులను దోచుకోవడం, ఆ భారాన్ని సామాన్యప్రజలపై రుద్దడ్డం వంటి అనేకానేక కారణాలచేత దేశప్రజలలో మోడీ సర్కార్ పట్ల వ్యతిరేకత పెరిగిందని చెప్పకతప్పదు.

ఇక మోడీ సర్కార్ దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందనే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలు, విమర్శలు కూడా మోడీ సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగేందుకు దోహదపడుతున్నాయి. కనుక ప్రజలలో నెలకొన్న ఈ వ్యతిరేకత తమకు అనుకూలంగామారవచ్చని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే వారివాదనకు బలం చేకూరుతుంది. అందుకే కాంగ్రెస్, భాజపాలు ఈ అసెంబ్లీ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి పోరాడుతున్నాయి. ఆ రెండింటిలో ఏది విజయం సాధిస్తుందో మే 15వ తేదీన తేలిపోతుంది.


Related Post