తెరాస, తెదేపాల మద్య మళ్ళీ యుద్దాలు తప్పవా?

May 08, 2018


img

ఓటుకు నోటుకేసుతో సహా గతంలో కాంగ్రెస్, తెదేపాల హయంలో జరిగిన అవినీతి, అక్రమాలన్నిటిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నట్లు తెరాస అనుకూల మీడియా ‘నమస్తే తెలంగాణా’ మంగళవారం సంచికలో “అవినీతి కేసులు తవ్వుడే!” అనే శీర్షికన ఒక వార్త ప్రచురించింది. 

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రగతి భవన్ లో ఎసిబి, పోలీస్, న్యాయనిపుణులతో ఓటుకు నోటుకేసుతో సహా కాంగ్రెస్, తెదేపా నేతలపై నమోదు చేయబడిన వివిధకేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబందించి ‘నమస్తే తెలంగాణా’లో ఈరోజు సంచికలో ప్రచురించిన వార్తలో, కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు హయంలలో హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాలలో, తెలంగాణా వ్యాప్తంగా ఏవిధంగా భూదోపిడీ జరిగిందో పేర్కొంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ దోపిడీలో ప్రధాన సూత్రధారి అని పేర్కొంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు హస్తం ఉందని, కోర్టులో ఆ కేసు కొనసాగుతుండగానే అయన తెలంగాణా ప్రభుత్వ వ్యవహారాలలో వేలుపెడుతున్నారని, అయన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఆ పత్రిక పేర్కొంది. 

ఇక కాంగ్రెస్ హయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సరితా ఇంద్రారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు అనేకమంది అవినీతికి పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు అయ్యాయి కానీ ఇంతవరకు అవి ఎందుకు విచారణ పూర్తికాలేదని సిఎం కెసిఆర్ ఎసిబి, పోలీస్ అధికారులను నిలదీశారని ఆ పత్రిక పేర్కొంది. తెలంగాణాను దోచుకొన్న కాంగ్రెస్, తెదేపానేతలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించినట్లు ఆ పత్రిక పేర్కొంది. కాంగ్రెస్, తెదేపా కేసుల విచారణకు వేర్వేరుగా రెండు కమీషన్లను ఏర్పాటుచేయాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించినట్లు పేర్కొంది. 

తెరాస సర్కార్ కు అనుకూల పత్రికగా పేరుపడ్డ ‘నమస్తే తెలంగాణా’ పత్రికలో వచ్చిన ఈవార్తను అధికారిక వార్తగానే పరిగనించవచ్చు. కనుక ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదలవబోతోందని భావించవచ్చు. అప్పుడు తెదేపా కూడా ఆత్మరక్షణ కోసం ‘టెలిఫోన్ ట్యాపింగ్ కేసులను’ పైకి తీయకమానదు. కనుక ఓటుకు నోటు కేసును కదిలిస్తే తెదేపా, తెరాసల మద్య మళ్ళీ భీకర యుద్ధం ప్రారంభం కావడం తధ్యం. ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నారు కనుక అయన కూడా సిఎం కెసిఆర్, తెరాస సర్కార్ పై విమర్శలు, ఆరోపణలు మొదలుపెట్టవచ్చు. 

ఇక కాంగ్రెస్ నేతలపై ఉన్న కేసులను తిరగదోడితే వారు చేతులు ముడుచుకొని కూర్చోరు కనుక వారు కూడా తెరాస సర్కార్ పై ఎదురుదాడి తీవ్రతరం చేయవచ్చు. అవసరమైతే కోర్టులలో కొత్త పిటిషన్లు వేసి తెరాస సర్కార్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేయవచ్చు. 

సిఎం కెసిఆర్ చెన్నై వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు, ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయనతో కూడా చర్చిస్తాను. ఆయనతో కలిసి పనిచేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. కానీ ఇప్పుడు బాబు అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని చెపుతున్నారని నమస్తే తెలంగాణా చెపుతోంది. కేవలం పది రోజులలోనే బాబు పట్ల కెసిఆర్ వైఖరిలో ఇంత మార్పు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ దానికి కారణం  ఏమిటో? ఆలోచించాలి. 


Related Post