కెసిఆర్ చెప్పేది ఒకటి..చేసేది మరొకటి: కూర్మనాధ్

May 08, 2018


img

‘సిఎం కెసిఆర్ రాష్ట్రాలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతున్నారు తప్ప ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య విభేధాలు ఏర్పడాలని ఎన్నడూ కోరుకోలేదని, పాత్రికేయుడు కూర్మనాధ్ కామెంట్లు ప్రజలను తప్పుద్రోవ పట్టించేవిగా ఉన్నాయని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు.

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య విభేదాలు సృష్టించాలని కెసిఆర్ ఎన్నడూ కోరుకొని మాట వాస్తవమే. ఒక భారతీయుడిగా దేశాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసుకొని ప్రపంచదేశాలలో గర్వంగా తలెత్తుకొనేలా చేయాలనేదే తన ఆశయమని కెసిఆర్ చెప్పారు. అయితే, నిధుల కేటాయింపు, విడుదల విషయంలో కేంద్రం తీరును కెసిఆర్ కూడా తప్పుపడుతున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపేణా వెళుతున్న దానిలో కనీసం సగం సొమ్ము కూడా తిరిగి రావడం లేదని ఆరోపిస్తున్నారు. దేశంలో తెలంగాణా వంటి ఆరేడు ధనికరాష్ట్రాలే మిగిలిన బీద రాష్ట్రాలను పోషిస్తున్నాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కనుక తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులు సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. 

దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, విడుదలలో 15వ ఆర్థిక సంఘం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 10న కేరళలోని తిరువనంతపురంలో, మళ్ళీ మే 7న విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ఆర్దికమంత్రుల సమావేశాలు జరిగాయి. ఆ రెండు సమావేశాలకు తెలంగాణా ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ ను పంపించలేదు. 

ఒకపక్క నిధుల కేటాయింపు, విడుదల విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ, దాని గురించే జరిగిన రెండు సమావేశాలకు తెలంగాణా ఆర్ధికమంత్రిని పంపించకపోవడంతో కెసిఆర్ వైఖరిపై అనుమానాలు వ్యక్తం అవడం సహజం. 

మోడీ సర్కార్ తో కెసిఆర్ కు రహస్య అవగాహన ఉన్నందునే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాలను అడ్డుకొన్నారని, నోట్లరద్దు, జి.ఎస్.టి., ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు పలికారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల దర్శకత్వంలోనే సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టారని, దానితో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అనుకూల, భాజపా వ్యతిరేక శక్తులను, ప్రజల ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

తెలంగాణా రాష్ట్రం తరపున ఆర్ధికమంత్రిని ఆ సమావేశానికి పంపించి ఉంటే, ఇటువంటి అనుమానాలకు ధీటుగా సమాధానం చెప్పినట్లయ్యేది. ఇక మరో విషయం ఏమిటంటే పాత్రికేయుడు కూర్మనాధ్ వ్యాఖ్యలను కేటిఆర్ ఖండించారే తప్ప దక్షిణాది రాష్ట్రాల ఆర్దికమంత్రుల సమావేశానికి తమ ఆర్ధికమంత్రిని ఎందుకు పంపించలేదో సమాధానం చెప్పనేలేదు. దేశరాజకీయాలలో విలువలతో కూడిన గుణాత్మకమైన మార్పు సాధించడం తన ఆశయం అని కెసిఆర్ చెప్పుకొంటున్నప్పుడు, ఇటువంటి అనుమానాలకు తావీయకుండా పారదర్శకంగా వ్యవహరించినప్పుడే ఆయనకు, ఫెడరల్ ఫ్రంట్ కు విశ్వసనీయత చేకూరుతుంది.


Related Post